టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. నేడు పాదయాత్ర 219వ రోజు సందర్భంగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా తేటగుంట యనమల అతిథి గృహం వద్ద లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, లోకేష్ తోడల్లుడు భరత్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకను వీక్షించేందుకు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో, తేటగుంట సమీపంలో జాతీయ రహదారి కోలాహలంగా మారింది.
ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ప్రజలే సైన్యంగా యువగళం 3 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరిందన్నారు. ఈ మజిలీకి గుర్తుగా తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించానని లోకేష్ అన్నారు.
ఇక, అనంతపురం జిల్లా అహోబిళంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ అమలు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై కూడా లోకేశ్ స్పందించారు. జగన్ మాయమాటలు, హామీలతో మోసపోయిన కర్షక, కార్మిక, ఉద్యోగులంతా ఏకం కావాలని, వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. జగన్ అరాచక పాలనలో అక్షరాలు నేర్పే గురువులు ఆత్మహత్యాయత్నం చేయడం దారుణమన్నారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని గద్దెనెక్కి 200 వారాలు దాటినా జగన్ అమలు చేయలేదని మండిపడ్డారు. జీపీఎస్ అంటూ జగన్ మరో వంచనకి తెరలేపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన వారు బాగున్నారని, మోసపోయినవాళ్లు ఆత్మహత్యాయత్నం చేయకూడదని పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates