ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే వాయు వేగంతో పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కీలక నిర్ణయాల్ని తీసుకోవటంలో ఆలస్యాన్ని అధిగమిస్తూ దూసుకెళుతున్నారు. ఇప్పటివరకు రేవంత్ అన్నతనే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటమే కనిపిస్తుంది. కానీ.. ఆయన్నుఏ మాత్రం ఊహించని అంశాల్లో ఆయన తీరు గురించి తెలిస్తే విస్మయానికి గురి అవుతారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారెవరికి లేని విలక్షణత రేవంత్ సొంతం. అదెలా అన్నది ఈ మొత్తం చదివినంతనే అర్థం కావటమే కాదు.. కొత్త తరానికి ప్రతినిధిగా రేవంత్ కనిపిస్తారు.
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన రేవంత్ వనపర్తిలో కాలేజీ చదువును పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్ కు మకాం మార్చేశారు. రియల్ ఎస్టేట్.. ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారాలు నిర్వహించేవారు. 2009 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన.. అక్కడే సొంతిల్లు కట్టుకున్నారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్నప్పుడు కల్వకుర్తిలో ఇంటిని నిర్మించుకున్నారు. దసరా వస్తే చాలు.. తాను ఎక్కడ ఉన్నా సరే ఆ పండక్కి మాత్రం కొడంగల్ కు వచ్చి ప్రజలతో మమేకం కావటం ఆయనకు అలవాటు.
కరోనా లాక్ డౌన్ సమయంలోకొడంగల్ లో ఉన్న ఆయనకు మరో అలవాటు ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లోని వారికి స్వయంగా వండి పెట్టే అలావాటు ఉంది. చికెన్ వండటంతో ఆయనకున్న నేర్పు గురించి ప్రత్యేకంగా చెబుతారు. రేవంత్ కు గ్రీనరీ అంటే ఇష్టం. అందుకే కొడంగల్ ఇంటి మొత్తాన్ని పచ్చని పచ్చికతో ఏర్పాటు చేసుకోవటం.. రకరకాల పూలమొక్కల్నిఏర్పాటు చేయటం కనిపిస్తుంది. పలు మొక్కల్ని ఆయనే స్వయంగా ఎంపిక చేసి మరీ.. ఇంటి నుంచి నాటించారు.
తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచే అలవాటున్న రేవంత్ .. నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తీసుకుంటారు. అనంతరం ఎక్సర్ సైజులు చేయటం.. యాపిల్.. పుచ్చకాయ జ్యూస్ తీసుకోవటం.. దినపత్రికల్ని సావధానంగా చదవటం అలవాటు. ఉదయాన్నే ఫ్రూట్ జ్యూస్.. కాసేపటికి టీతో మొదలు పెట్టి.. ముఖ్యమైన వారికి ఫోన్ చేయటం.. ఇంటికి వచ్చిన వారితో మాట్లాడతారు. స్నానం చేశాక చపాతి.. జొన్నరొట్టె తీసుకుంటారు. నాటుకోడి కూర అంటే ఇష్టం. మటన్ బిర్యానీ కూడా ఇష్టమే. మధ్యాహ్నం ఆలస్యమైతే డ్రైఫ్రూట్ తీసుకుంటారు. ముద్దపప్పు.. సాంబార్.. పెరుగన్నం రోజువారీ మెనూలో ఉండాల్సిందే.
ఇంతేనా.. రేవంత్ కు ఆటలంటే చాలా ఇష్టం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్ని కొడంగల్ లో నిర్వహించటం చూస్తే.. ఆటలకు ఆయన చూపే ఆసక్తి ఎంతన్నది అర్థమవుతుంది. ఊరికి వెళ్లేటప్పుడు హైదరాబాద్ నుంచి వివిధ రకాల పండ్లను ఇంటికి తీసుకొస్తారని.. వాటిలో ఆయనకు తప్పనిసరిగా జ్యూస్ ఇవ్వాలని చెబుతారు. ఇలా సగటు జీవి మాదిరి అలవాట్లు ఉన్న రేవంత్ కు సినిమాలు చూడటం కూడా ఇష్టం. ఏ మాత్రం ఖాళీ ఉన్నా సినిమాలకు వెళ్లటం చేస్తుంటారు.