తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని స్వాగతిస్తున్నామని.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 64 స్థానాల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల సమయంలోనే ప్రకటించి ఉంటే.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసి ఉండేదని చెప్పారు. ఎన్నికలు అయ్యే వరకు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తేల్చకపోవడం, పైగా.. ఒకరికి మించి.. చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి తామంటే తామేనని ప్రకటించుకున్న దరిమిలా.. ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడిందని చెప్పారు.
అయితే.. ముఖ్యమంత్రిగా రేవంత్ ను ప్రకటించి ఉంటే.. అన్ని వర్గాల ప్రజల నుంచి ముఖ్యంగా తెలంగాణ సమాజం నుంచి కూడా.. మంచి ఆదరణ లభించి.. ఏకంగా 100 మార్కు సీట్లను కాంగ్రెస్ తన సొంతం చేసుకుని ఉండేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల గురించి మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ప్రజలు హిందూత్వకు పట్టం కట్టారని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓటును తనవైపు తిప్పుకోవడంలో బీజేపీ నేర్పరి తనం ప్రదర్శించిందని పీకే వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టడంలో ఇటు బీఆర్ ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీలు సరైన పాత్ర పోషించలేకపోయాయని పీకే వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ.. అక్కడ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై నిరంతరం కేంద్రం పెద్దలు పర్యవేక్షించారని, ప్రధాని నేరుగా రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని పీకే చెప్పారు. అందుకే.. అక్కడ వ్యతిరేకత రాలేదని.. పైగా పుంజుకుందన్నారు. ఈ పరిస్థితిని అంచనా వేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
మరోవైపు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. సీట్ల వివాదం కూటమి ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. “ఇండియా కూటమి నుంచి ఒకే ఒక్క అభ్యర్థిని..ఒక్కొక్క స్థానం నుంచి నిలబెట్టాలనే వ్యూహం తప్పు. ఇది సాధ్యం కాదు. ఇక్కడే ఇండియా విచ్ఛిన్నమవుతుంది” అని పీకే వ్యాఖ్యానించారు. ఈ లోపాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తే పురోగతి ఉండే అవకాశం ఉంటుందన్నారు.