చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలతో తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఇంతకీ చంద్రబాబు ఏమంటున్నారంటే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని. తాను చేయించుకుంటున్న సర్వేల్లో పాజిటివ్ రిజల్టు వచ్చిన వారికి మాత్రమే టికెట్లిస్తానని కచ్చితంగా చెబుతున్నారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి టికెట్ల విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొహమాటాలకు పోయి ఎవరికి పడితే వాళ్ళని అభ్యర్ధులుగా ఎంపికచేసేది లేదని స్పష్టంగా చెప్పేశారు.
మామూలుగా అయితే చంద్రబాబు నోటివెంట ఇలాంటి మాటలు వినలేరు. ఎందుకంటే నేతలపైన మనసులో ఎలాంటి అభిప్రాయాలున్నా పైకి మాత్రం అందరు బాగానే పనిచేస్తున్నారనే చెబుతారు. టికెట్ సంగతి తనకు వదిలేసి నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేయండని చెబుతుంటారు. అయితే ఇపుడు మాత్రం గతానికి భిన్నంగా తమ్ముళ్ళతో మాట్లాడుతున్నారు. గతంలో కూడా సర్వేలు చేయించుకునే అలవాటున్నా ఒత్తిళ్ళకు కూడా లొంగిపోయేవారు. అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం ఒత్తిళ్ళకు ఎట్టి పరిస్ధితుల్లోను లొంగేదిలేదని చెప్పేశారు.
అందుకనే చంద్రబాబు తాజావ్యాఖ్యలు చూసిన తర్వాత తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ప్రతి నియోజకవర్గంలోను ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్లను ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏలందరికీ మళ్ళీ టికెట్లు ఇస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. కాబట్టి 19 మందికి టికెట్లు ఖాయమైనట్లే. ఇక మిగిలింది 156 నియోజకవర్గాలు. ఇందులో కూడా ఎన్నోకొన్ని జనసేనకు పొత్తులో ఇవ్వాల్సుంటుంది.
అలాగే జనసేనకు తక్కువలో తక్కువ ఓ 25 సీట్లిస్తారని అనుకున్నా మిగిలింది 131 సీట్లు. 40 శాతం టికెట్లు యువతకు ఇస్తానని చాలాసార్లు ప్రకటించారు. దీని ప్రకారం తీసుకుంటే 52 సీట్లు యువతకు ఇవ్వాలి. ఇక మిగిలింది 79 నియోజకవర్గాలు. ఈ 79 నియోజకవర్గాల్లోనే సీనియర్లకు టికెట్లివ్వాల్సుంటుంది. అందుకనే సీనియర్లు, జూనియర్లు, యువత అని తేడా లేకుండా చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లోను సర్వేలు చేయించుకుంటున్నారు. దాని ప్రకారమే టికెట్లు ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యారు. అంటే టికెట్లిచ్చే విషయంలో చంద్రబాబు ఎంత కచ్చితంగా ఉండబోతున్నది ఈ సర్వేలు, సమీక్షల్లోనే తెలిసిపోతోంది. అందుకనే ఏదో పద్దతిలో టికెట్లు సాధించుకోవాలని అనుకుంటున్న తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది.