నెక్స్ట్ టార్గెట్ ధరణేనా?

బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. ముందు విద్యుత్ శాఖ వ్యవహారాలపై సమీక్ష మొదలుపెట్టగానే అందులోను అవకతవకలు బయటపడ్డాయి. సమీక్షలో ఉన్నతాధికారులు బయటపెట్టిన వివరాల ప్రకారం విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్ల అప్పుల్లో ఉందని తేలింది. అలాగే జెన్ కో, ట్రాన్స్ కో లో జరిగిన అనేక అక్రమాలు కూడా మెల్లిగా బయటపడుతున్నాయి. విద్యుత్ శాఖ సమీక్ష తాలూకు వేడి మెల్లిగా మొదలైంది.

ఈ వేడి ఇలాగ మొదలవ్వగానే వెంటనే రెండో టార్గెట్ కూడా మొదలైపోయినట్లుంది. ఇంతకీ రెండో టార్గెట్ ఏమిటంటే ధరణి పోర్టల్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా పెద్దఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు చాలాకాలంగా ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. మంత్రులు, ఎంఎల్ఏలుగా పనిచేసిన వాళ్ళతో పాటు కొందరు సీనియర్ నేతలు కూడా పోర్టల్ ను అడ్డుపెట్టుకుని వందలు, వేల ఎకరాల భూములను కబ్జా చేసినట్లు రేవంత్ రెడ్డితో సహా చాలామంది నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

వీటన్నింటికీ పరాకాష్టగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరిగిన దగ్గర నుండి ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3వ తేదీ మధ్యలో పెద్దఎత్తున అడ్డదారిలో వందలాది ఎకరాలు అక్రమంగా అధికార పార్టీ నేతల పేరుతో బదిలీ అయినట్లు బయటపడింది. అందుకనే దానికి బాధ్యులైన కొందరు ఉద్యోగులపై కేసులు నమోదుచేసి సస్పెండ్ చేసింది ప్రభుత్వం. గడచిన పదేళ్ళలో ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు భూ అక్రమాలకు  పాల్పడినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

అందుకనే నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాలు పూర్తవ్వగానే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధరణి పోర్టల్ లో జరిగిన అక్రమాలపై సమీక్ష పెట్టుకున్నట్లు సమాచారం. ముందుగా రెవిన్యు మంత్రితో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి ప్రాధమిక సమాచారం రెడీ చేయమని చెప్పారట. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కీలకమైన కారణాల్లో ధరణి పోర్టల్లో అవకతవకలు కూడా ప్రధానమైనదనే చెప్పాలి. మరి ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి సమీక్షలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.