వైసీపీ కీలక నాయకుడు, ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు తాను ఏదైనా పనిమీద వచ్చిన వారు డబ్బులు ఇస్తే(లంచాలు) తీసుకు న్నానని చెప్పారు. అంతేకాదు.. తాను తీసుకున్న సొమ్ము వెయ్యి కోట్లు ఉంటుందని చెబుతున్నారని.. అంత లేదని.. కావాలంటే లెక్కేసుకోవచ్చవని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడు తూ… సీఎం జగన్‌పై నా విమర్శలు గుప్పించారు.
30 ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఒంగోలు నుంచే పోటీచేస్తానని, మరో నియోజకవర్గానికి వెళ్లబోనని బాలినేని వెల్లడించారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులు అందరూ కలిసి పని చేస్తానంటేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్‌కి చెప్పినట్టు తెలిపారు.
తాను నీతి మంతుడినని చెప్పడం లేదన్న బాలినేని.. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నానన్నారు. ఇక, సీఎం జగన్‌కు తమకు, తమ కుటుంబానికి ఎనలేని అభిమానం ఉందని, ముఖ్యంగా తమ కుమారుడు అయితే.. సీఎం జగన్ అంటే ప్రాణం పెడతాడని.. కానీ, ఎంత సేపూ మేమే పూసుకుంటున్నాం కానీ.. ఆయన వైపు కూడా అభిమానం ఉండాలి కదా.. అదే లేదు! అని బాలినేని తేల్చి చెప్పారు.
ఇక, తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టానని బాలినేని మరో సంచలన వ్యాఖ్య చేశారు. అయితే.. తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగిన తమ కుమారుడు మాత్రం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడని.. దీంతో పందెం రద్దుచేసుకున్నానని వెల్లడించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు చెబుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోందని మండిపడ్డారు.