తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం ఓ కొలిక్కి రాలేదు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం రేసులో ఉండి డిప్యూటీ సీఎం అయిన మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖతోపాటు, విద్యుత్ శాఖను కేటాయించారు. ఇక, సీఎం రేసులో ఉన్న మరో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖను కేటాయించారు.
ఇక, కేటీఆర్ లేని ఐటీ శాఖను ఊహించుకోలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ దక్కింది. ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మదన్ మోహన్ పేరు కూడా ఐటీ శాఖా మంత్రి పదవి రేసులో తెరపైకి రాగా.. చివరకు శ్రీధర్ బాబుకు అవకాశం దక్కింది. సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి హోంమంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగినా..హోం శాఖతోపాటు ఎవరికీ కేటాయించని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు.
- మల్లు భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ
- ఉత్తమ్ కుమార్ రెడ్డి – పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖ
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ
- శ్రీధర్ బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రెవెన్యూ, హౌసింగ్, ఐ అండ్ పీఆర్ (సమాచార శాఖ)
- కొండా సురేఖ- అటవీ, దేవాదాయ శాఖ
- సీతక్క- పంచాయత్ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు
- తుమ్మల నాగేశ్వరరావు- రైతు, చేనేత
- జూపల్లి- ఎక్సైజ్, టూరిజం
- పొన్నం-రవాణా, బీసీ సంక్షేమ శాఖ
- దామోదర రాజనరసింహ- ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ