ఫిబ్రవరిలోనే ఎన్నికలా ?

తెలంగాణా ఎన్నికలు ముగియగానే అందరి దృష్టి ఇపుడు ఏపీ ఎన్నికలపైన పడింది. దానికి తగ్గట్లే షెడ్యూల్ ఎన్నికలు ఏప్రిల్ లో కాదని ఇంకా ముందుగానే జరుగుతాయనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఫిబ్రవరి 2వ తేదీన షెడ్యూల్ జారీ అవుతుందట. మార్చి 6వ తేదీన పోలింగ్ జరుగుతుందట. ఇందులో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలీదు. అయితే ఇది ప్రచారం కాదని నిజమయ్యే అవకాశముందని అనిపిస్తోంది.

ఎందుకంటే ఇదే విషయమై నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు మాట్లాడుతు ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని నింపాదిగా ఉండదని హెచ్చరించారు. ఫిబ్రవరి చివరలో కానీ మార్చి తొలివారంలో కానీ పోలింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముందుగా నేతలంతా ఓటర్లజాబితాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలన్నారు. ఒటర్లజాబితాల్లోని అవకతవకలను సరిచేసుకుంటునే పార్టీ పటిష్టానికి అందరు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కాబట్టి అధికారంలోకి వచ్చేయటం ఖాయమని నేతలు నిర్లక్ష్యంగా ఉంటే దెబ్బపడటం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి ఎంత ఎఫెక్టివ్ గా తీసుకెళ్ళితే పార్టీకి అంత ఉపయోగం ఉంటుందని గుర్తుచేశారు. నిరంతరం ప్రజల్లోనే ఉన్న నేతలను జనాలు కూడా గుర్తుంచుకుంటారన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని చెప్పారు. సమస్యలతో ఎవరొచ్చినా మాట్లాడేందుకు వాళ్ళకి సమయం ఇవ్వాలని సూచించారు. అహంకారం పనికిరాదన్నారు. అహంకారంతో వ్యవహరిస్తే ఏమవుతుందో తెలంగాణా ఎన్నికల్లో ఫలితాలే నిరూపించినట్లు చెప్పారు.

అహంకారంతో ప్రవర్తించిన వాళ్ళు ఓడిపోయి ఇళ్ళకు వెళ్ళారని, జనాల్లోనే తిరిగినవాళ్ళు గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలన్నారు. తాను కట్టించిన ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చిన విషయం, ప్రగతిభవన్లో జనాలకు అడ్డుగా ఉన్న ముళ్ళకంచెను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించటాన్ని జనాలందరు చెప్పుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. జనాలు చాలా తెలివైన వాళ్ళని తగిన సమయంలో తగిన విధంగా సమాధానం చెప్పగలరని చంద్రబాబు అన్నారు. కాబట్టి చంద్రబాబు తాజా వ్యాఖ్యలు విన్నతర్వాత ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరిగే అవకాశముంది.