తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో కీలకమైన ‘మహాలక్ష్మి’ పథకానికి సీఎం రేవంత్‌రెడ్డి పచ్చజెండా ఊపారు. ఈ పథకం కింద.. రాష్ట్రంలోని మహిళలు.. వయసుతో సంబంధం లేకుండా.. ఎక్కడ నుంచి ఎక్కడకైనా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తోనూ ప్రభుత్వం మాట్లాడింది. అనంతరం.. ఈ పథకాన్ని పట్టాలెక్కింది. మహాలక్ష్మి పథకం .. శనివారం ఉదయం 1.30 గంటల నుంచే అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి 7200 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం చేశారు.
రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇక, ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థలో చరిత్రాత్మక నిర్ణయంగా ఇది మారనుంది. ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుంది.
ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది. ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక, ఈ పథకం కింద.. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానికత ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుంది. ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ఇస్తారు. 5.. 6 రోజుల తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా జీరో టికెట్ ప్రింటింగ్ మోడ్‌లో ఇవ్వనున్నారు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతారు. ప్రస్తుతం 7,200 సర్వీసులను మహాలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates