నాకు సిగ్గుంది.. అత‌ని స‌మ‌క్షంలో ప్ర‌మాణం చేయ‌ను

ఘోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అత‌ని స‌మ‌క్షంలో ప్ర‌మాణం చేయ‌ను.. నాకు సిగ్గుంది. అంత‌కు మించిన అభిమానం ఉంది. నేను భార‌తీయుడిని“ అని రాజాసింగ్ అన్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్మం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యేల చేత‌.. శాస‌న స‌భ‌లో ప్ర‌మాణం చేయించాల్సిన అవ‌స‌రం ఉంది.

దీనికి సంబంధించి రేవంత్‌రెడ్డి స‌ర్కారు నిర్ణ‌యానికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. శ‌నివారం నుంచి నాలుగు రోజుల పాటు స‌భ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేలంద‌రితోనూ.. ప్ర‌మాణం చేయించ‌నున్న‌ట్టు తెలిపింది. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ ఎమ్మెల్యే గా ఉన్న ఎంఐఎం నాయ‌కుడు, చాంద్రాయ‌ణ‌గుట్ట స‌భ్యుడు అక్బ‌రుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీక‌ర్‌గా ఎన్నుకుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నేతృత్వంలో ఎమ్మెల్యేల‌తో ప్ర‌మాణం చేయించ‌నున్నారు.

అయితే.. ఆది నుంచి కూడా ఎంఐఎంను వ్య‌తిరేకిస్తున్న బీజేపీ స‌బ్యుడు రాజాసింగ్.. ఇప్పుడు ప్రొటెం స్పీక‌ర్‌గా అక్బ‌రుద్దీన్‌ను ఎన్నుకోవ‌డం ప‌ట్ల కూడా తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ఆయ‌న స‌మ‌క్షంలో ప్ర‌మాణం చేయ‌బోన‌ని వెల్ల‌డించారు. అంతేకాదు.. త‌న‌లో భారతీయ ర‌క్తం పారుతోంద‌న్నారు. దీంతో శ‌నివారం నిర్వ‌హించే ఎమ్మెల్యేల ప్ర‌మాణ కార్య‌క్ర‌మానికి రాజాసింగ్ డుమ్మా కొట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, పూర్తిస్థాయిలో స్పీక‌ర్ బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత‌.. రాజా సింగ్ ప్ర‌మాణం చేసే అవ‌కాశం ఉంది. ఇది జ‌రిగేందుకు మ‌రో నెల రోజులు ఆయ‌న వెయిట్ చేయాలి. ఫ‌లితంగా ఆయ‌న‌కు ఈ నెల రోజుల పాటు.. జీత భ‌త్యాలు అంద‌వు.