ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే.. తుమ్మల నాగేశ్వరరావు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు మధ్యలో 2004-2014, 2018-2023 తప్ప.. అన్ని ప్రభుత్వాల్లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ రికార్డు ఇప్పటి వరకు జీవించి ఉన్న నాయకుల్లో ఎవరికీ లేకపోవడం గమనార్హం.
టీడీపీతో రాజకీయాలు ప్రారంభించిన తుమ్మల దాదాపు 40 ఏళ్లకు పైగానే పాలిటిక్స్ చేస్తున్నారు. అన్నగారు ఎన్టీఆర్ హయాంలోనే రాజకీయ అరంగేట్రం చేసిన తుమ్మల.. అప్పటి నుంచి 2014 రాష్ట్ర విభజన వరకు నమ్మకమైన నాయకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రిగా పనిచేశారు. 1985, 1995, 1996, 1999, 2001లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వాల్లో చిన్ననీటి పారుదల, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా తుమ్మల పనిచేశారు.
ఇక, ఆ తర్వాత.. టీడీపీ నుంచి బీఆర్ ఎస్‌లోకి వచ్చిన తర్వాత కూడా 2014లో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. 2018లో పాలేరు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.
ఈసారి బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌పై ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు మరోసారి మంత్రి పదవి దక్కడం విశేషం. ప్రస్తుతం కొలువు దీరిన రేవంత్ మంత్రివర్గంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఏకైక మంత్రి కూడాఈయనే కావడం మరో రికార్డు!!
Gulte Telugu Telugu Political and Movie News Updates