మొదటి దెబ్బే గట్టిగా తగిలిందా ?

బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గట్టిగా షాకిచ్చింది. విషయం ఏమిటంటే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ జీవన్ రెడ్డి ఉన్నారు. పదేళ్ళ అధికారాన్ని అడ్డంపెట్టుకుని నిజామాబాద్ లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్ధలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ ఖాళీ స్ధలంలో పెద్ద షాపింగ్ మాల్ కట్టారు. అప్పట్లో జీవన్ రెడ్డికి, ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య జరిగిన ఒప్పందం ఏమిటో బయటవాళ్ళు ఎవరికీ తెలీదు.

అగ్రిమెంటు ప్రకారం షాపింగ్ మాల్ కట్టిన జీవన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు అధికారాలను బాగానే ఎంజాయ్ చేశారు. అలాంటిది ఇపుడు సడెన్ గా అధికారులు షాపింగ్ మాల్ కరెంటును నిలిపేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే వెంటనే మొదటిదెబ్బ జీవన్ రెడ్డి మీద పడింది. కారణం ఏమిటంటే సంవత్సరాల తరబడి మాజీ ఎంఎల్ఏ షాపింగ్ మాల్ రెంట్ కట్టడంలేదు, అలాగే మాల్ కు విద్యుత్ బిల్లులు కూడా కట్టలేదు.

షాపింగ్ మాల్ అద్దే సుమారు రు. 7.5 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇక షాపింగ్ మాల్ విద్యుత్ బకాయిలు ఎంతన్నది తెలీలేదు. సుమారు రెండు బకాయిలు కలిపి రు. 10 కోట్లదాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బకాయిల వసూళ్ళ కోసం అధికారులు ఎన్నిప్రయత్నాలు చేసినా జీవన్ రెడ్డి లెక్కచేయలేదు. బకాయిలు కట్టమని అధికారులు అడగటమే తప్పన్నట్లుగా మాజీ ఎంఎల్ఏ మండిపోయేవారు. అధికార పార్టీ నేత, పైగా కేసీయార్ కు బాగా సన్నిహితుడని చెప్పుకునే వారు.

దాంతో అధికారుల తరపున ఎంత ఒత్తిడి వచ్చినా జీవన్ లెక్కేచేయలేదు. పైగా బకాయిలు అడగాలంటేనే అధికారులు భయపడిపోయేవారు. ఇన్ని సంవత్సరాలుగా జీవన్ రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇలాగే నెట్టుకొచ్చారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే అధికారులకు ఎక్కడలేని ధైర్యం వచ్చినట్లుంది. అందుకనే సంబంధిత అధికారులు షాపింగ్ మాల్ కు వెళ్ళి బకాయిల విషయమై నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా మాల్ కు విద్యుత్ కనెక్షన్ కట్ చేసేశారు. వెంటనే బకాయిలు కట్టకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చారు. ఇలాంటి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఎంతముందున్నారో.