మ‌రోసారి ఓడినా.. పార్టీని విలీనం చేయ‌ను: ప‌వ‌న్‌

“పార్టీని విలీనం చేస్తాన‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. బీజేపీతో క‌లిసి ఉన్నాన‌న్న‌ది ఎంత నిజ‌మో.. పార్టీని విలీనం చేయ‌బోన‌నేది అంతే నిజం. మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా.. పార్టీని విలీనం చేసే ప్ర‌స‌క్తే లేదు. 2014లో పోటీ చేయ‌కుండా మ‌ద్ద‌తు తెలిపాం. 2019లో ఒంట‌రిగానే బ‌రిలో నిలిచి పోరాడాం. ఓడిపోయాం. అయినా.. పార్టీని నిల‌బెట్టుకున్నాం. ఇప్పుడు కూడా అంతే. మ‌రోసారి ఓడిపోయినా.. పార్టీని మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ విలీనం చేసే ప్ర‌సక్తే లేదు” అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించా రు.

తాజాగా విశాఖ‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని.. ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పని చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. మార్పు కోసం ఓట్లు కావాలని పవన్‌ వెల్లడించారు. గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్ల ఓడిపోయినా.. త‌న‌కు బాధ అనిపించ‌లేద‌ని.. కానీ వైసీపీ పాల‌న‌లో ప్ర‌జాస్వామ్యం ఓడిపోతుంటేనే బాధ‌నిపిస్తోంద‌ని అన్నారు.

“అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం ఓట్లు అడుగుతా. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల.. అందరినీ ఆహ్వానించే నేల. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి.. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలి. కష్టం వస్తే ఆదుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నా. పదవుల కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నా” అని అన్నారు.