ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయకండా ఓట్లు వేయమంటే.. ఎవరూ వేయరని, ఈ విషయం తనకు తెలిసి వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ఎన్నికల పోల్ మేనేజ్ మెంట్పై దృష్టి పెట్టాలని.. ఎన్నికల సంఘమే మనకు 45 లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే అవకాశం ఇచ్చిందన్నారు.
ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు ఓటర్లను చేయి పట్టి నడిపించేందుకు డబ్బులు ఖర్చు చేయాల్సిందేనని చెప్పారు. జనసేన-టీడీపీ కి మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించే బాధ్యతను పార్టీ నాయకులు తీసుకోవాలన్నారు. వారు జనసేన-టీడీపీకి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పదవులు ఆశించవద్దని ఆయన సూచించారు. తనకు పదవులపై కాంక్ష లేదని.. నాయకులు కూడా మార్పును మాత్రమే కోరుకోవాలి తప్ప పదవులు కాదని సూచించారు.
జనసేన-టీడీపీ పొత్తుపై విమర్శలు చేసేవారంతా వైసీపీ కోవర్టులేనని గతంలో చెప్పిన తన మాటకు కట్టుబ డే ఉన్నానని పవన్ వ్యాఖ్యానించారు. ఎవరూ కూడా పొత్తులపై చర్చలు పెట్టద్దని సూచించారు. ఎన్నికల పైనే దృష్టి పెట్టాలని.. రాష్ట్రంలో వైసీపీని గద్దె దించడమే పనిగా పనిచేయాలి తప్ప.. పదవులు ఇస్తేనే.. టికెట్లు ఇస్తేనే పనిచేస్తామనే తరహా ఆలోచనలకు స్వస్తి పలకాలని సూచించారు. తాను ఓటమి నుంచి వచ్చినవాడినని.. తనను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరికీ గుర్తింపు దక్కేలా తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. క్షేత్రస్థాయిలో పాలు-తేనె మాదిరి గా టీడీపీతో జనసేన నాయకులు కలిసి పనిచేయాలని సూచించారు. పొరపొచ్చాలు రాకుండా చూసుకోవాలని.. చెప్పారు. వచ్చే పదేళ్లపాటు ఉమ్మడి ప్రభుత్వం ఉండేలా కార్యాచరణకు నడుం బిగించాలన్నారు. ఎవరిపైనా తనకు కోపం లేదని.. జగన్‌పై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని మరోసారి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని.. ఇది ప్రజలే కోరుకుంటున్న ప్రభుత్వమని అన్నారు.