మళ్ళీ చంద్రబాబునాయుడు దూకుడు పెంచుతున్నట్లే ఉన్నారు. మిచౌంగ్ తుపాను బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఫెయిలైందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తుపాను సహాయక చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వానికి గుర్తుచేశారు. హుద్ హుద్ తుపాను, తిత్లీ తుపాను సందర్భంగా తాను వ్యవహరించిన విధానాన్ని ప్రస్తావించారు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే ఈనెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అధికార వైసీపీ దొంగఓట్లను చేర్పిస్తోందని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు.
ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమీషన్ ను కలిసి ఫిర్యాదులు చేయబోతున్నారు. పార్టీ యంత్రాంగం ద్వారా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఎంపీలు కొందరు సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే 10వ తేదీన ఇదే విషయమై ఎన్నికల కమీషన్ నుండి కొందరు ఉన్నతాధికారులు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో వాళ్ళు పర్యటించేలోగానే కొంత సమాచారం ఇస్తే బాగుంటుందని చంద్రబాబు డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే ముందుగా తానే ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదులు చేయబోతున్నారు.
అక్కడి నుండి తిరిగిరాగానే 17వ తేదీన భీమిలీలో బహిరంగసభలో పాల్గొంటారని పార్టీవర్గాలు చెప్పాయి. యువగళం పాదయాత్రను లోకేష్ భీమిలీలో ముగించబోతున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా భిమిలీలో బహిరంగసభ జరుగుతోంది. ఆ సభకు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. బహిరంగస అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా జనాల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గ రూటుమ్యాపును చంద్రబాబు రెడీ చేసుకుంటున్నారు.
జనవరి మొదటివారం నుండి జిల్లాల పర్యటనలు చేయబోతున్నట్లు సమాచారం. రాయలసీమ, కోస్తా జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారట. ఇందులో తనతో పాటు పవన్ కూడా పాల్గొనబోతున్నారని పార్టీవర్గాల టాక్. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిపికేషన్ రాబోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదే నిజమైతే ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి జనవరి నుండే జనాల్లోకి వెళ్ళిపోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి వీలుగానే డిసెంబర్లో దూకుడు పెంచబోతున్నారు. మరి చంద్రబాబు ప్లాన్ ఎంతమాత్రం వర్కవుటవుతుందో చూడాలి.