తిరుమలలో నాసిరకం భోజనం వివాదం

సీఎం జగన్ పాలనలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, ఎస్వీబీసీ మాజీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ ఆడియో టేపు దుమారం..వంటి అంశాలతో కలియుగ దైవం వెంకన్న ప్రతిష్టను జగన్ సర్కార్ మసకబారుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇక, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం, టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటలు, కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం లేకపోవడం వంటి వ్యవహారాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం నడుచుకుంటోందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయినా సరే తీరు మారని క్రమంలో తాజాగా తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా మరో అంశం తెరపైకి వచ్చింది. తిరుమలలో తినే భోజనం నాణ్యత లేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఇది అన్నమేనా…దీనిని ఎలా తింటాం అంటూ భక్తులు మండిపడుతున్నారు. ఆకలికి ఉండలేక…పెట్టిన భోజనం బాగోలేక వడ్డించిన విస్తరిని అలాగే వదిలేసి చాలామంది భక్తులు అర్ధాకలితో వెళ్తున్నారని కొందరు భక్తులు ఆందోళన చేపట్టారు. తిరుమలకు వచ్చే భక్తులకు కడుపు నిండా మంచి భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో టీటీడీ, జగన్ ప్రభుత్వం ఉన్నాయని విమర్శించారు. ఆ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో టీటీడీ, ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

హిందువులు ఇప్పటికైనా మేలుకోకుంటే తిరుమల పవిత్రత మరింత దెబ్బతింటుందని వారు కామెంట్లు చేస్తున్నారు. క్రిస్టియన్ ముఖ్యమంత్రి పాలనలో ఇంతకన్నా ఏం ఆశించగలం అంటూ విమర్శిస్తున్నారు.