అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ చిత్రం .. ఈ విషయాన్ని ఆసక్తిగా మార్చింది. కీలక నాయకులు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. సహజంగానే వారిపై సింపతీ వస్తుంది. ఇది ఏకంగా వారిని అధికారం వరకు నడిపించడం ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. సదరు నాయకులు ఏ కేసులో జైలుకు వెళ్లారన్నది ఇక్కడ ప్రధానం కాదు.. తమ నాయకుడిని జైలు పాలు చేశారు!అనేదే సింపతీ!! ఇదే వర్కవుట్ అవుతోంది. నాయకులకు కలిసి వస్తోంది.
గతంలో వైసీపీ అధినేత జగన్‌ను అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను 16 నెలలపాటు చంచల్‌గూడ జైల్లో ఉంచారు. అయితే.. ఇది తీవ్రమైన నేరమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పటికీ ఈ కేసులు మాత్రం కొలిక్కి రాలేదు. కానీ, ప్రజల్లో మాత్రం జగన్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. పలితంగా 2019లో ఆయనకు సీఎం పదవిని కట్టబెట్టి.. అధికారం అప్పగించారు.
ఇక, తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి కూడా.. 2015-16 మధ్య కాలంలో జైలు జీవితం గడిపిన నాయకుడే. ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. నామినేటెడ్ ఎమ్మెల్యేకు నగదు ఇస్తూ.. ఆయన దొరికిపోయారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చకు, వివాదానికి కూడా దారి తీసింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీనే ఆయన అధికారంలోకి తీసుకువచ్చారు. తాను కూడా విజయం దక్కించుకున్నారు.
నెక్ట్స్ ఎవరు?
ఈ పరిణామాలను గమనిస్తే.. నెక్ట్స్ ఇదే కోవలో అధికారంలోకి వచ్చేదెవరు? అనే చర్చ రాజకీయంగా జోరుగా సాగుతోంది. దీనిని గమనిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబుపేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవలే ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయించడం.. జైలుకు తరలించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్‌పై చంద్రబాబున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జగన్.. ఇప్పుడు రేవంత్.. రేపు బాబు అధికారంలోకి రావడం ఖాయమని నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు.