ఎంపీల లెక్క సరిపోయిందా ?

తాజాగా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీచేసిన ఆరుగురు ఎంపీల లెక్క సరిపోయింది. లెక్కసరిపోవటం అంటే ముగ్గురు ఎంపీలు ఓడిపోయి మరో ముగ్గురు ఎంపీలు గెలిచారు. కాంగ్రెస్ తరపున ఎంపీలుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంఎల్ఏలుగా పోటీచేసి గెలిచారు. అలాగే బీజేపీ తరపున పోటీచేసిన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఓడిపోయారు.

రేవంత్ మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో కొడంగల్, కామారెడ్డిలో పోటీచేశారు. సొంత నియోజకవర్గం కొడంగల్ లో గెలిచి కామారెడ్డిలో ఓడిపోయారు. అలాగే భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో పోటీచేసి గెలిచారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. వీళ్ళల్లో రేవంత్ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో దూసుకుపోతున్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకళ్ళు మంత్రివర్గంలో ఉండే అవకాశాలున్నాయి.

ఇక బీజేపీలో చూస్తే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎంఎల్ఏగా పోటీచేసి ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. నిజానికి ఈ ముగ్గురికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయటం ఏమాత్రం ఇష్టంలేదు. అయితే సీనియర్లు ప్రత్యేకించి ఎంపీలందరు ఎంఎల్ఏలుగా పోటీచేయాల్సిందే అని అధిష్టానం ఆదేశించటంతో పోటీచేయక వీళ్ళకు తప్పలేదు. అయితే కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రమే పోటీచేయకుండా తప్పించుకున్నారు.

వీళ్ళు కాకుండా బీఆర్ఎస్ తరపున మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక అసెంబ్లీ నియోజకవకర్గంలో పోటీచేసి గెలిచారు. బీజేపీలోని ముగ్గురు ఎంపీలు ఓడిపోయి, కాంగ్రెస్ లోని ముగ్గురు ఎంపీలు గెలిచారంటే వీళ్ళ వ్యక్తిగత పనితీరు కూడా కారణమనే అనుకోవాలి. దీనికి అదనంగా కాంగ్రెస్ వేవ్ కొంత ఉండటం రేవంత్, కోమటరెడ్డి, ఉత్తమ్ గెలుపుకు సహకరించిందనే అనుకోవాలి. ఏదేమైనా రెండుపార్టీల్లోని ఎంపీల లెక్కయితే సరిపోయింది.