ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. ఈ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్కే. గుడివాడ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు.. ఫైర్ బ్రాండ్ కొడాలి నాని. వరుస విజయాలతో దూసుకు పోతున్న కొడాలి నానికి చెక్ పెట్టాలనేది టీడీపీ వ్యూహం. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయం.. రెండు వ్యక్తిగతం కూడా..! రాజకీయంగా నానిని ఓడించడం.. ఒక భాగమైతే.. రెండోది చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతం విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయనను ఓడించాలనేది పార్టీ లక్ష్యం.
ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం.. గుడివాడ నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఇక్కడ టికెట్‌ను కూడా దాదాపు ఖరారు చేసేసింది. ప్రవాసాంధ్రుడు, కొన్నాళ్లుగా ఈ నియోజకవర్గంలో కలివిడిగా ఉంటూ.. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెనిగళ్ల రాముకు టికెట్ ఇవ్వడం ఖాయమనే వాదన పార్టీలో వినిపిస్తోంది. తాజాగా చంద్రబాబు వెనిగళ్ల రాముతో చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయన గుడివాడ ఇంచార్జ్ బాధ్యతలు కూడా ఇచ్చారని చెప్పాయి.
అయితే.. వాస్తవానికి ఇక్కడ రావి వెంకటేశ్వరరావు ఇప్పటి వరకు ఇంచార్జిగా ఉన్నారు. అయితే.. మారిన పరిణామాలు.. ఆర్థిక బలం వంటివాటిని పరిగణనలోకి తీసుకున్న టీడీపీ అధినేత వెనిగళ్లకు జైకొట్టారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు తెలిపాయి. ఇక, ఇక్కడి టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రావితోనూ చంద్రబాబు చర్చించారు. ఆయనకు ఒక షరతు పెట్టారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో వెనిగళ్లను గెలిపించుకునేలా.. పార్టీ కార్యక్రమాలను జోరందుకోవాలని.. పార్టీని గెలిపించాలని చంద్రబాబు సూచించారు.
అంతేకాదు.. ప్రస్తుత ఎన్నికలను తీవ్రంగా భావించాలని.. గడపగడపలోనూ నాయకులను కదిలించే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారని తెలిసింది. గుడివాడను గెలుచుకుని వస్తే.. అంటే వెనిగళ్లను గెలిపిస్తే.. రావికి అత్యంత ప్రాధాన్యముండే పదవిని ఇస్తామని.. అదేవిధంగా పార్టీ అధికారంలోకి రాగానే మరో పదవిని కూడా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి గుడివాడలో టికెట్ వ్యవహారాన్ని చంద్రబాబు చాలాసున్నితంగా తేల్చేయడం గమనార్హం.