తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళిసైకు అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదిక కూడా అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సీఈవో వికాస్ రాజ్ గవర్నర్‌కు సమర్పించారు. మరోవైపు ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సర్క్యులర్ జారీ చేశారు.
సీఎంతో పాటు కొందరు మంత్రుల కోసం అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. ఈ మేరకు దిల్‌కుష అతిథి గృహానికి వాహనాలను తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి తగిన విధంగా సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జీఏడీ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది. అధికారులు పాత బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు. అదేవిధంగా కొత్త మంత్రులకు సిబ్బందిని కూడా రెడీ చేశారు.
మరోవైపు, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, టెంట్లు, సహా ఇతరత్రా సామగ్రిని ఇప్పటికే తరలించారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్ఎంసీ సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన కసరత్తు చేశారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజభవన్‌కు వెళ్లి.. ప్రస్తుతం అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates