తెలంగాణ కాంగ్రెస్ గెలుపు… ఏపీ కాంగ్రెస్‌లో ఊపు!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకున్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేత‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రెడిట్ మొత్తాన్ని రేవంత్ ఖాతాలో వేసేందుకు సీనియర్లు సైతం ఎవ‌రూ వెనుకాడ‌డం లేదు. అంద‌రూ రేవంత్‌ను కొనియాడుతున్నారు. రేవంత్ ఇంటికి కీల‌క అధికారుల నుంచి రాజ‌కీయ నేత‌ల వ‌ర‌కు అంద‌రూ క్యూ క‌డుతున్నారు.

ఇదిలావుంటే.. తెలంగాణ‌లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకోవ‌డంతో.. ఏపీలోనూ సంబ‌రాలు ఊపందుకు న్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంత త‌ర్వాత‌.. తొలిసారి ఇక్క‌డ కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుని, అధికారంలోకి వ‌చ్చే దిశ‌గా అడుగులు వేసింది. ఇది.. త‌మ‌కు కూడా లాభిస్తుంద‌ని.. త‌మ‌పై ఉన్న కోపాన్ని కూడా త‌గ్గిస్తుంద‌ని ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప‌లువురు ప్ర‌చారం కూడా చేశారు.

తాజాగా తెలంగాణ‌లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకోవ‌డంతో.. ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో క‌లిసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఇదిలావుంటే.. తెలంగాణ‌లో గెలిచిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుంద‌ని.. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా అయినా.. మారుతుంద‌ని నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.