సీఎం సీటిస్తే.. తీసుకుంటా:  భ‌ట్టి

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. స‌హ‌జంగా అంద‌రి దృష్టీ.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి పీఠంపైనే ఉంది. ఈ సీటును ద‌క్కించుకునేందుకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయితే.. కొంద‌రు త‌ప్పుకొన్నా.. మ‌రికొంద‌రు న‌ర్మ‌గ‌ర్భంగా ప్ర‌య‌త్నాలు  ముమ్మ‌రం చేస్తున్నారు. వీరిలో తాజాగా ఖ‌మ్మం జిల్లాకు చెందిన భ‌ట్టి విక్ర‌మార్క ముందుకు వ‌చ్చారు. ఎస్సీ మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన భ‌ట్టి.. మ‌ధిర నియోక‌వ‌ర్గం నుంచి 35 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పాలేరు నుంచి విజ‌యం సాధించిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డితో క‌లిసి మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాధ్యతగా స్వీకరిస్తానని ఈ సంద‌ర్భంగా భ‌ట్టి అన్నారు. తెలంగాణలో దొరల పాలన పోయి ప్రజల తెలంగాణ పాలన వచ్చిందని అన్నారు. ప్రజలకు ఇచ్చి హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయ్యిన తర్వాత ఎమ్మెల్యేలంతా ఒక్కచోట చేరతామని, ఎమ్మెల్యేలంతా సీఎల్పీ లీడర్‌గా కొనసాగమంటే కొనసాగుతానని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న తీరు దొరల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంద‌న్నారు. తాము ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తామ‌ని చెప్పారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 100 రోజుల్లో అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని భ‌ట్టి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంద‌రూ క‌లిసి క‌ట్టుగానే ఉన్నార‌ని చెప్పారు. ఎవ‌రూ త‌క్కువ కాద‌న్నా రు. అధిష్టానం తీసుకునే నిర్ణ‌యాల‌కు అంద‌రూ క‌ట్టుబ‌డ‌తార‌ని చెప్పారు. ప్ర‌స్తుత విజ‌యం ఏ ఒక్క‌రిదో కాద‌ని.. పార్టీ స‌మ‌ష్టి విజ‌య‌మ‌ని భ‌ట్టి పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కు.. విమ‌ర్శ‌లు చేయ‌బోమ‌న్నారు. త‌మ‌కు విజ‌యాన్ని అందించిన ప్ర‌జ‌ల‌కు భ‌ట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు.