కనీ వినీ ఎరుగని ఆనందం.. ఊహకు కూడా అందని విజయానందం.. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడమే తప్ప.. అధికారంలోకి వచ్చే దిశగా ఆ మేరకు సాధన చేయలేని అంతర్గత కుమ్ములాటలతో అలసిసొలిసిన కాంగ్రెస్‌లో ఇప్పుడు అంబరాన్నంటిన ఆనందం.. రేవంత్‌రెడ్డి సారథ్యంలో కలిసి కట్టుగా ఒక్కుమ్మడిగా సాగించిన పోరు.. అందించిన విజయానందం!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో మేజిక్ ఫిగర్ 60 ని దాటేసి మరో ఏడు స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్‌లో ప్రతి నాయకుడు ఆనందంగానే ఉన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రేవంత్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఏదైతే చెప్పుకొచ్చారో.. ఇప్పుడు కూడా అదే మాట నిలబెట్టుకునే తీరుగా ప్రజలకు సందేశం పంపించారు.
అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు అంటూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. “అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates