తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకోవడం.. ఇదే సమయంలో బీఆర్ ఎస్ అధికారానికి దూరం కావడం తెలిసిందే. ఇక, బీజేపీ, దాని మిత్రపక్షం జనసేన కూడా.. దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలుగు దేశం పార్టీ అలెర్ట్ అయింది. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన.. గెలిచిన వారిని ఉద్దేశించి ఎవరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని.. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు ప్రకటన జారీ చేశారు.
ఇదీ.. సందేశం..
తెలంగాణ ఎన్నికల ఫలితం ఏదైనా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల నిర్ణయం. దానిని అన్ని పార్టీల వలే మనం కూడా శిరోధార్యంగా భావించాలి. ఫలితాలను చూసి మీ మీ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి కానీ ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి.
ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. 40 సంవత్సరాలకు పైగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొని అధికార పక్షం పాత్ర అయినా, ప్రతిపక్షం పాత్ర అయినా పార్టీ పరంగా కానీ, నాయకులు, కార్యకర్తల పరంగా కానీ మనం మన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించాం. తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఏపీలో మనం ఎదుర్కోబోయే ఎన్నికలపై దృష్టి పెడదాం. ధన్యవాదాలు. అని చంద్రబాబు, నారా లోకేష్ స్పష్టం చేశారు.