ఎగ్జిట్ పోల్సే నిజ‌మ‌య్యాయి.. కేటీఆర్‌ ఏమంటారు!

“ఎగ్జిట్ పోల్స్‌ను మేం న‌మ్మం. అవ‌న్నీ వృథా. టైం వేస్ట్‌. రేపు అస‌లు రిజ‌ల్ట్ వ‌చ్చాక‌.. క్ష‌మాప‌ణ‌లు చెబుతారా?“ అంటూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబందించి ప‌లు సంస్థ‌లు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేల‌పై బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, మంత్రి కేటీఆర్ చేసిన విమ‌ర్శ‌లు ఇంకా గుర్తుండే ఉంటాయి. అయితే.. ఇప్పుడు వాస్త‌వ ఫ‌లితం తెర‌మీదికి వ‌చ్చేసింది.

ఈవీఎం పెట్టెల్లో భ‌ద్రంగా దాగి ఉన్న ప్ర‌జాతీర్పు.. బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. పెల్లుబికిన‌.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే.. ఈ ఫ‌లితం.. పూర్తిగా రాకున్నా.. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్‌లో వ‌చ్చిన ఫ‌లిత‌మే.. ఇక్క‌డ కూడా ప్ర‌తిబింబించింది. బీఆర్ ఎస్‌కు 44-46 స్థానాలు, కాంగ్రెస్‌కు 56-64 స్థానాలు వ‌స్తాయ‌ని మెజారిటీ సంస్థ‌లు లెక్క‌లు క‌ట్టాయి. దీంతో కాంగ్రెస్ పుంజుకోవ‌డం అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపించింది.

కానీ, ఈ వాద‌న‌ను త‌ప్పుబ‌డుతూ. కేటీఆర్‌.. ఎక్స్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. క్ష‌మాప‌ణ‌లు చెబుతారా? అంటూ.. ప్ర‌శ్నించారు. అయితే.. ఇప్పుడు అదే ఎగ్జిట్ పోల్ ఫ‌లితం నిజ‌మ‌య్యే దిశ‌గా ఎన్నిక‌ల కౌంటింగ్ ముందుకు సాగుతోంది. బీఆర్ ఎస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా, కాంగ్రెస్ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక‌, బీజేపీ 11 చోట్ల‌, ఎంఐఎం 3 స్థానాలు, స్వతంత్ర అభ్య‌ర్థులు 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా తెలంగాణ ఫ‌లితం ఇది. దీనిని ప‌రిశీలిస్తే.. ఎగ్జిట్ పోల్ ఫ‌లితం ఎంత యాక్యురేట్‌గా నిజ‌మైందో అర్ధ‌మ‌వుతోంది. మ‌రి దీనికి కేటీఆర్ ఏమంటారో చూడాలి.