కాపురం చేసే కళ.. కాలిగోటిలోనే తెలుస్తుందన్నట్టు.. ఏరాష్ట్రంలో అయినా..ఎన్నికల పోలింగ్ మొదలు కాగానే.. తొలుత లెక్కించే పోస్టల్ బ్యాలెట్‌లోనే గెలిచే పార్టీని అంచనా వేసేయొచ్చు. అలానే తెలంగాణ లోనూ.. పోస్టల్ బ్యాలెట్.. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాయి. తొలి రౌండ్ లెక్కింపు నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్‌లు.. ఎక్కడా చికాకు పెట్టలేదు. ఎవరినీ ఊరించలేదు. చాలా స్పష్టంగా.. చాలా పక్కాగా తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాయి.
కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్లు రావడం గమనార్హం. ఇదే.. కాంగ్రెస్‌కు బలమైన శక్తిగా మారింది. ఇక, పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే.. బీఆర్ ఎస్ నాయకులు కేసీఆర్(గజ్వేల్, కామారెడ్డి), కేటీఆర్(సిరిసిల్ల) కూడా.. వెనుకబడిపోయారు. చివరి వరకు వారికి పోస్టల్ బ్యాలెట్ అనుకూలంగా లేదు. ఇక, ఈవీఎంల ఓట్లు లెక్కించడం ప్రారంభించాక మాత్రమే.. ఇద్దరూ తేరుకున్నారు.
అయితే.. ఈ పోస్టల్ బ్యాలెట్‌లో ఎందుకింత బీఆర్ ఎస్‌కు వ్యతిరేకత కనిపించింది? దీనివెనుక ఉన్న రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. పోస్టల్ బ్యాలెట్ అంటే.. ఇది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన అభిప్రాయాలను చెప్పేది. సో.. ప్రస్తుతం తెలంగాణలోని ఉద్యోగులు కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేది పోస్టల్ బ్యాలెట్ కుండబద్దలు కొట్టింది.
ప్రతి నెలా 1న జీతాలు ఇవ్వకపోవడం.. సీపీఎస్ రద్దు చేయకపోవడం.. ఉద్యోగులకు సంబంధించి డీఏలను ఏళ్ల తరబడి పెండింగులో పెట్టడం, రాజకీయ ఒత్తిళ్లు.. ఇలా అనేక కోణాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను నిరాశే పరిచింది. ఇదే పోస్టల్ బ్యాలెట్ రూపంలో స్పష్టమైందని పరిశీలకులు చెబుతున్నారు.