తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఎన్నికల పోలింగ్ అనంతరం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత జరిగిన ఈ పరిణామం.. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మారిన సీన్.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 30 మంది పోలీసులు రేవంత్ ఇంటి చుట్టుపక్కల భద్రతకు కేటాయించడం గమనార్హం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఆయన ఇంటికి పోలీసు భద్రత ఉంది.
అయితే.. ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత.. ఈ భద్రతను నాలుగింతలు పెంచడం గమనార్హం. శుక్రవారం సాయంత్రానికి ఓ మాదిరిగా ఉన్న భద్రత రాత్రికి మరింత పెరిగింది. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు.ఇదిలావుంట, పోలింగ్ అంచనాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇంటికి భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఆయన నివాసానికి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికీ రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు భయపడకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని కొనియాడారు. మీ కష్టం, శ్రమ వృథా కాలేదని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని.. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.