ఏపీ అధికార పార్టీ వైసీపీ అరాచకాలను పార్లమెంటులోనూ లేవనెత్తాలని టీడీపీ ఎంపీలకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అదేసమయంలో రాష్ట్రంలోనూ యుద్ధం ప్రకటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలుప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో వైసీపీ అరాచకాలు.. ఓట్ల తొలగింపు, ఎస్సీలపై వేధింపులు, తన అరెస్టు సహా బెదిరింపులు, వ్యవస్థలను మేనేజ్ చేయడం, అధికారులను ప్రలోభాలకు గురిచేయడం వంటివిషయాలను పార్లమెంటులో చర్చించాలని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.”ఈగోలకు పోవద్దు. ఇది మీ పార్టీ. మన పార్టీ. రేపు అధికారంలోకి రావాల్సి ఉంది. చిన్ని చిన్న తప్పులు ఉంటే సరిచేసుకుందాం. ఈగోలను పక్కన పెట్టండి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మీరు కూడా కష్టపడాలి. ఒక్కరు శ్రమిస్తే.. అందరూ ఫలాలు అనుభవించే పరిస్థితి ఉంటుందని అనుకోవద్దు. అన్నీ గమనిస్తున్నా. ప్రతి ఒక్కరూ సమష్టిగా ముందుకు రావాలి” అని చంద్రబాబు సూచించారు. దీనికి ముందు ఆయన గన్నవరం విమానాశ్రయానికి రాగా.. పార్టీ నేతల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.
తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి చంద్రబాబు వచ్చారు. ఇక, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కేసరపల్లి గూడవల్లి , నిడమానూరు, ఎనికెపాడు, ప్రసాదంపాడులో చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పట్టారు. రోడ్లు మీదకు వచ్చి చంద్రబాబుకు మహిళలు సంఘీభావం తెలిపారు. గన్నవరం నియోజకవర్గ ప్రసాదంపాడులో జన ఉత్సాహం ఉప్పొంగిపోయింది. చంద్రబాబును చూసేందుకు మహిళలు, ప్రజలు రోడ్లమీదకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబుని మహిళలు, తెలుగు తమ్ముళ్లు పూలతో ముంచెత్తారు. గన్నవరం నుంచి రామవరప్పాడు రావడానికి నాలుగు గంటల సమయం పట్టింది. కాగా, చంద్రబాబు కారు డోర్‌పక్కన నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. అనంతరం.. పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.