“పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు ఎలాంటి పదవులు అవసరం లేదు. మీరు(జనసేన నాయకులు) కూడా ఈ దిశగానే ఆలోచించాలి. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. పదవుల కోసం ఆరాటం ఎందుకు? పదవులు ఇప్పుడు ఉంటాయి రేపు పోతాయి. క్షణకాలం ఉండే పదవుల కోసం ఆరాటం ఎందుకు” అని జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీఉన్నతస్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి పార్టీ నేతలు.. నాదెండ్ల మనోహర్, నాగబాబు సహా పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణను పవన్ ప్రకటించారు. ఓటర్ల జాబితాలో అవకతవక లపై చర్చించారు. జనసేన, టీడీపీ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. “వైసీపీ వంటి పార్టీలకు ఈ పరిణామాలు ఇబ్బంది అనిపిస్తాయి. బీజేపీ, టీడీపీతో ఎలా కలుస్తారని నన్ను అంటున్నారు. అసలు నన్ను విమర్శించే అర్హత వైసీపీలో ఎవరికీ లేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలు క్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా తీసుకుంటాను. జనసేనకు యువతే పెద్ద బలం” అని అన్నారు.
వైసీపీకి ఎలాంటి భావజాలం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అతి ఉన్నతమైన భావజాలంతో జనసేన పార్టీని తాను స్థాపించానని పవన్ చెప్పారు. రాష్ట్రంలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉందన్నారు. తాను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదని, పార్టీలో ఉన్నవారు కూడా స్వార్థం వదిలేయాలని నేతలను కోరుతున్నానని చెప్పారు. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుందన్నారు. ఏపీ భవిష్యత్తును ఒక నిర్ధిష్టమైన విధానంలో అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.
ఏపీలో ఎన్నికలకు వంద రోజుల సమయమే ఉందన్నపవన్.. నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. జనసేనకు బలం మన యువతరమేనని చెప్పారు. “రెండు కోట్ల లోపు బడ్జెట్‌తో నేను పార్టీ పెట్టాను. జనసేనకు 13వేల మందిగా ఉన్న యువత నేడు 6 లక్షలకు చేరారు. ప్రజల సమస్యలు పట్ల స్పందించడమే నా విధానం. సుగాలి ప్రీతి విషయంలో చాలా ఆవేదన చెందాను. పది మందికి డబ్బులు ఇచ్చే సంస్కృతి నాకు లేదు. స్వచ్ఛందంగా యువత తరలి వస్తున్నారు” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.