ఉమ్మ‌డి మేనిఫెస్టోపై టీడీపీ- జ‌న‌సేన.. అంత‌ర్గ‌త పోరు..!

టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంగా ఏర్ప‌డ్డాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపుడే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించాయి. అయితే.. దీనిని కొంద‌రు టీడీపీ నాయ‌కులు, జ‌న‌సేన నేత‌లు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. వీరిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు స‌మ‌న్వ‌య క‌మిటీలు కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా.. కొన్ని జిల్లాల్లో స‌క్సెస్ అయి.. మ‌రికొన్ని జిల్లాల్లో వివాదంగా మారాయి. ఈ త‌తంగం కొన‌సాగుతుండ‌గానే.. ఇప్పుడు జ‌న‌సేన నేత‌లు మ‌రో కొత్త‌వాదన తెర‌మీద‌కి తెచ్చారు.

ఇప్ప‌టికే మినీ మేనిఫెస్టోను తెచ్చిన .. టీడీపీ-జ‌నసేన అధినేతలు బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో మా త్రం.. ఈ రెండు పార్టీల ముఖ్య నాయ‌కులు.. అంత‌ర్గ‌త పోరుకు రెడీ అయ్యారు. ప‌వ‌న్ హామీల‌కే పెద్ద‌పీట వేశామ‌ని.. మినీ మేనిఫెస్టోను చ‌దివి వినిపించిన స‌మ‌యంలో మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌క‌ట‌న చేశారు. అయితే.. దీనిపై జ‌న‌సేన నాయ‌కులు భిన్న‌మైన వాద‌న లేవనెత్తారు. ఆల్రెడీ.. టీడీపీ ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టోలోని అంశాలే ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు.

ఒకే ఒక్క హామీ.. యువ‌త‌కు 10 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని.. ఇది కూడా .. అనేక ష‌ర‌తులు పెట్టార‌ని.. జన‌సేన నేత‌లు చెబుతున్నారు. అంతేకాదు.. గ‌తంలో ప‌వ‌న్ రెండు కీల‌క సంత‌కాల‌పై ఇచ్చిన హామీల‌ను వారు ప్ర‌స్తావిస్తున్నారు. ఒక‌టి.. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేలా.. తీసుకునే నిర్ణ‌యంపై త‌న తొలి సంత‌కం ఉంటుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఇక‌, రెండోది.. కౌలు రైతుల‌కు సాధార‌ణ రైతుల‌తో స‌మానంగా గుర్తింపు ఇచ్చే అంశం.

సుగాలి ప్రీతి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన‌ప్పుడు, కౌలు రైతుల కుటుంబాల‌ను క‌లుసుకుని ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన‌ప్పుడు ప‌వ‌న్ ఈ రెండు సంత‌కాల‌ను ప్ర‌స్తావించారు. అయితే.. తాజాగా ప్ర‌క‌టించి మినీ మేనిఫెస్టోలో ఈ రెండు అంశాలు లేవు. దీనిపై జ‌న‌సేన నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు.. టీడీపీ నాయ‌కుల నుంచి కూడా.. కొన్ని వాద‌న‌లు వ‌స్తున్నాయి.

మెజారిటీ హామీల‌ను టీడీపీ వైపు నుంచే ఉంచాల‌ని.. ప‌వ‌న్ చెప్పిన‌ట్టు కాదు.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుని మేనిఫెస్టోను రూపొందించాల‌ని వారు కోరుతున్నారు. అయితే.. ఇది అంత‌ర్గ‌త స‌మావేశాల్లోనే వినిపిస్తున్న వ్య‌వ‌హారం. ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు. దీంతో టీడీపీ-జ‌న‌సేన మేనిఫెస్టోలో మ‌రిన్ని మార్పులు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.