భర్తలకు తోడుగా భార్యామణులు కూడా ప్రచారం చేసే ట్రెండ్ తెలంగాణలో పెరిగింది. ఒకప్పుడు .. ఏపీ వరకే పరిమితమైన ఈ ట్రెండ్.. తాజా ఎన్నికల్లో ఎక్కువగా కనిపించింది. వాస్తవానికి తెలంగాణలో మహిళా చైతన్యం తక్కువనే అంటారు. అందుకే.. ప్రస్తుతం 2300 మంది పోటీలో ఉంటే.. వీరిలో 210 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. అంటే.. ఎంత తక్కువో అర్థమవుతుంది. పదిశాతం మంది కూడా లేరు. అయితే.. ఇప్పుడు ప్రచారంలో మాత్రం మహిళ పాత్ర ఎక్కువగా కనిపిస్తోంది.
కీలక నేతల కుటుంబాల నుంచి కూడా మహిళలు రోడ్డెక్కుతున్నారు. ప్రచారం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ సతీమణి.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులతో ఆమె మాట్లాడుతున్నారు. కానీ, ఇవన్నీ.. సైలెంట్‌గా జరుగుతున్నాయి. ఇక, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సతీమణి.. ఇంటింటికీ తిరుగుతూ.. మహిళల ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అదేసమయంలో హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ సతీమణి జమున కూడా.. ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు.
అదేవిధంగా బీజేపీలో కూడా ఈ దఫా మహిళ ప్రచారం కనిపిస్తోంది. కొందరైతే.. కుటుంబాలకు కుటుంబాలుగా.. రోడ్డెక్కారు. ప్రచారం చేస్తున్నారు. ఇక, ఎమ్మెల్సీ కవిత.. పైకి కనిపించకుండా.. అంతర్గత ప్రచారం లో దుమ్ము రేపుతున్నారు. లిక్కర్ వివాదం నేపథ్యంలో బహిరంగ ప్రచారం చేస్తే.. ప్రతిపక్షాల నుంచి విమ ర్శలు ఎదురయ్యే చాన్స్ ఉందని భావించిన ఆమె మండల స్థాయిలో నాయకులకు ప్రచారం చేస్తున్నారు. ఇక, బండి సంజయ్ కుమారుడు, కుటుంబం కూడా ప్రచారంలో ఉంది. మంత్రి గంగుల కుటుంబం కూడా.. ప్రచారంలోనే ఉంది.
ఏదేమైనా.. గత రెండు ఎన్నికలకు భిన్నంగా.. ఇప్పుడు.. ప్రచారంలో మహిళల పాత్ర పెరగడం గమనార్హం. అంతేకాదు.. కొందరు సెంటిమెంటును ప్లే చేస్తే.. మరికొందరు త్యాగాలను కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి భర్తలకు తోడుగా.. భార్యలు, తండ్రులకు తోడుగా బిడ్డలు చేస్తున్న ప్రచారం.. ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.