తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక చిత్రమైన సంగతులు వెలుగు చూస్తున్నాయి. పదే పదే ఓడిపోతున్నా.. అలుపెరగకుండాపోటీ చేస్తున్నవారు కొందరైతే.. ఒకే అభ్యర్థిపై గత 20 ఇరవై ఏళ్లు తలపడుతున్న నాయకులు మరికొందరు ఉన్నారు. ఇలాంటివారిలో ఇప్పుడు ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న నాయకులు మంచిరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి. వీరిద్దరూ 2004 నుంచి ప్రత్యర్తులుగా చెరో పార్టీ పక్షాన పోటీ చేయడం.. ఒకరు గెలవడం సాధారణంగా మారింది.
ఇక, ఇప్పుడు మరోసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మంచిరెడ్డి, మల్‌రెడ్డి తలపడుతున్నారు. వీరి పోరు ఆసక్తిగా మారింది. మంచిరెడ్డి రెండుసార్లు టీడీపీ తరఫున, ఒకసారి బీఆర్‌ఎస్ తరఫున గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక, మల్‌రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు మలక్‌పేట ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి అదే పార్టీ నుంచి ఇబ్రహీంపట్నం బరిలోకి దిగారు.
వాస్తవానికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య పోరు 2004 ఎన్నికల్లోనే మలక్‌పేట నియోజకవర్గంలో మొదలైంది. ఆ ఎన్నికల్లో మంచిరెడ్డి టీడీపీ తరఫున బరిలోకి దిగి.. కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఈ ఇద్దరూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మారారు. ఇద్దరూ అవే పార్టీల తరఫున పోటీ చేయగా.. అప్పట్లో మంచిరెడ్డి గెలుపొందారు.
ఇక, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం రంగారెడ్డికి కాకుండా శ్యామ మల్లేశ్‌కు టికెట్ ఇచ్చింది. రంగారెడ్డి కి మహేశ్వరం టికెట్ కేటాయించింది. అయితే ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, మరోసారి మంచిరెడ్డిదే పైచేయి అయింది. రాంరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఇక తాజా ఎన్నికల్లో మంచిరెడ్డి మరోసారి బీఆర్‌ఎస్ నుంచి, మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates