ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షాలు అనేక ఫిర్యాదులు చేస్తున్నాయి. ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు కూడా.. అనేక రూపాల్లో ఫిర్యాదులు మొస్తున్నాయి. ప్రభుత్వం దూకుడుగా ఉంటోందని.. ప్రతిపక్షాల గొంతు నులిమేస్తోందని.. ప్రజలను హింసిస్తోందని.. ఎస్సీలు, ఎస్టీలపైనా దాడులు చేస్తోందని.. ఇలా .. అనేక రూపాల్లో నిత్యంవందల కొద్దీ ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే.. ఇవన్నీ.. రాజకీయంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేవే.
అయితే.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి నేరుగా.. జగన్‌కు ఒకప్పుడు సన్మిత్రుడుగా వ్యవహరించి.. ఆయన కోసం తిరుమలలోనే సుదర్శనయాగం చేసి.. తిరుమల వ్యవహారాలపై నిత్యం.. వైసీపీకి(అప్పట్లో ప్రతిప క్షం) లీకులు అందించిన.. అప్పటి ప్రధాన అర్చకుడు.. రమణ దీక్షితులే.. ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రధాని మోడీ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం ప్రధాని మోడీ.. శ్రీవారిని దర్సించుకున్న అనంతరం.. ఆయన బస చేసిన శ్రీరచన గెస్ట్ హౌస్‌లో ప్రత్యేకంగా రమణ దీక్షితులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కారుపై పుంఖాను పుంఖానులుగా ఫిర్యాదులు సమర్పించారు. తిరుమల ఆలయం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని.. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు.. రాష్ట్రంలో హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను టీటీడీలోని సనాతన అధికారి క్రమ పద్ధతిలో నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. దయచేసి శ్రీవారి ఆలయాన్ని రక్షించి ఇక్కడ వెంటనే హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని.. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మోడీకి రమణ దీక్షితులు విన్నవించినట్టు తెలిసింది. ఏదేమైనా.. సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదేసమయంలో సీఎం జగన్‌కు అన్నీతానై.. వ్యవహరించిన రమణదీక్షితులు ఇప్పుడు పూర్తిగా యాంటీ కావడం చర్చనీయాంశం అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates