ఏపీ వైసీపీ నాయకుడు, మంత్రి అంబటి రాంబాబుకు భారీ సెగ తగులుతోంది. గత 2019 ఎన్నికల్లో ఆయన కు జెండా మోసి.. ఆయన గెలుపులో పాలు పంచుకున్న నాయకులే .. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. ఆయన వద్దు.. అని తేల్చి చెప్పేస్తున్నారు. ఎన్నికలకు మరో 100 రోజులు ఉండగానే.. అంబటిపై తీవ్ర సెగలు కక్కుతుండడంతో అధిష్టానం అలెర్ట్ అయింది. వెంటనే వారిని బుజ్జగించాలని పై స్థాయి నుంచి మంత్రికి వర్తమానం అందింది.
ఏం జరిగింది?
సమ్మతి.. అసంతృప్తి.. వ్యతిరేకతతో మంతి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నేతలు పోరాటానికి దిగుతున్నారు. మంత్రి మాకొద్దంటూ ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు స్వరం పెంచారు. గత కొంతకాలంగా మంత్రిపై అసమ్మతి తారాస్థాయికి చేరింది. పార్టీలో గ్రూపులను పోత్సహిస్తున్నారని, విభజించు పాలించు అన్న చందాన మంత్రి వ్యవహరిస్తున్నరన్న ఆరోపణలున్నాయి.
సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా మంత్రికి దూరమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అంబటికి పార్టీ టిక్కెట్ లేదంటూ అసమ్మతి నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాన సామాజికవర్గ నేతలు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రాంబాబుకు చెక్ పెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయబాస్కరరెడ్డి స్థానిక నినాదాన్ని తెరపైకి తెచ్చారు. నియోజకవర్గంలో అంబటిని వ్యతిరేకిస్తున్న క్యాడర్‌తో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులను దూరం పెట్టి కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారని మంత్రికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు పనిచేస్తున్నారు. రాజుపాలెం మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన గణపవరానికి చెందిన మర్రి వెంకట రామిరెడ్డి అంబటి వ్యవహార శైలి నచ్చక ఆయనకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కోట నెమలిపురి, సత్తెనపల్లి మండలం పాకాలపాడు, కంటెపూడి, కొమెరపూడి పెదమక్కెన మండలాల్లో కీలకమైన ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు ఇక్కడ అంబటికి తీవ్ర సెగలు ఎదురవుతున్నాయి. దీంతో వెంటనే ఆయా నేతలను బుజ్జగించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. అంతేకాదు..ఇతర పనులు మానేయాలని కూడా ఆదేశించడం గమనార్హం. మరి మంత్రి వర్యులు ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates