రోజులు గడుస్తున్న కొద్దీ మాయదారి కరోనాకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అమెరికాలోని పాతికేళ్ల యువకుడికి వచ్చిన కరోనా వైరస్ కు సంబంధించి సరికొత్త అంశాలు బయటకు వచ్చాయి. అప్పటికే ఒకసారి పాజిటివ్ గా తేలి.. చికిత్స పొంది నెగిటివ్ గా తేల్చారు. నెల తిరిగేసరికి మరోసారి కరోనా అటాక్ కావటం ఒక ఎత్తు అయితే.. ఈసారి సదరు వ్యక్తిలో వచ్చిన లక్షణాలు భిన్నంగా ఉండటం అక్కడి వైద్యుల్ని ఆశ్చర్యానికి.. ఆందోళనకు గురి చేసింది.
అమెరికాలోని నవాడాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కరోనా రెండోసారి కూడా వస్తుందన్న విషయం ఇప్పటికే రుజువు కావటమే కాదు.. పలు దేశాల్లో ఆ తరహా ఉదంతాలు మీడియాలోనూ రిపోర్టు అయ్యాయి. హాంకాంగ్ లో ఒక ఐటీ ఇంజనీర్ కు కరోనా వైరస్ రెండోసారి సోకినట్లు గుర్తించారు. కానీ.. అతడిలో లక్షణాలు పెద్దగా బయటపడలేదు. ఇందుకు భిన్నంగా అమెరికా కేసు ఉండటం గమనార్హం.
అమెరికాలో రెండోసారి కరోనా సోకిన వ్యక్తిలో తీవ్రమైన రోగ లక్షణాలు బయటపడ్డాయి. సదరు యువకుడిలో జ్వరం.. తలనొప్పి.. జలుబు.. డయేరియా లాంటి లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాదు సదరు యువకుడు శ్వాస తీసుకోవటానికి సైతం ఇబ్బంది పడుతున్న వైనాన్ని గుర్తించి అతడికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించారు. ఈ యువకుడిలోని రోగ లక్షణాలు భిన్నంగా ఉండటంతో నెవాడా స్టేట్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ పరిశోధకులు పరిశోధనలు షురూ చేశారు.
వీరి అధ్యయనంలో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. మొదటిసారి వచ్చిన వైరస్ కు రెండోసారి సోకిన వైరస్ కు సంబంధం లేదని తేల్చారు. రెండోసారి వైరస్ జన్యుక్రమం భిన్నంగా ఉండటంతో.. దీన్ని విశ్లేషించే పనిలో పడ్డారు అక్కడి పరిశోధకులు. వూహాన్ లో పుట్టిన ఈ మాయదారి వైరస్ తనను తాను మార్చుకునే లక్షణం ఉందన్న విషయాన్ని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. దీంతో.. ఈ వైరస్ మళ్లీ.. మళ్లీ రావటమే కాదు.. ఒకసారికి రెండోసారికి సంబంధం లేని రీతిలో వస్తుందన్నది రుజువైనట్లుగా చెప్పక తప్పదు. సో.. వైరస్ అటాక్ అయిన వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.