ఎన్నికలు అనగానే నాయకులు.. ఏం చెబుతారో పెద్దగా ఊహించాల్సిన అసవరం లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్తే అక్కడి పాటే పాడుతున్నారు. పైగా పోటీ తీవ్రంగా ఉన్న తెలంగాణలో అయితే.. మరింతగా ఎక్కువగా నాయకులు ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా సీఎం కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కాపోణ్నే.. నేను కూడా వ్యవసాయం చేస్తా. వరి నాటేస్తా.. నాకు రైతుల కష్టాలు తెలుసు! అని వ్యాఖ్యానించారు.
తాజాగా ఖానాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన కేసీఆర్.. జాన్సన్ నాయ్ పక్షాన ప్రచారం చేశారు. రైతు బంధు కావాల్నా వద్దా..? అని ప్రజల అభిప్రాయం తీసుకున్నారు. కాంగ్రెస్ వస్తే.. రైతు బంధును బొందపెడతారని వ్యాఖ్యానించారు. రైతు బంధు కావాలంటే.. కేసీఆర్‌ను గెలిపించుడు కాదు.. ముందు జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని ఆయన విన్నవించారు.
ఇక, పింఛను విషయంలోనూ.. గత కాలపు లెక్కలు వల్లె వేశారు. 40 నుంచి 60 రూపాయలు ఇచ్చిన స్థాయి నుంచి ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. పేదలకు, వృద్ధులు, దివ్యాంగులకు.. ఈ సొమ్ము అంతో ఇంతో మేలు చేస్తుందని ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతెందుకు ఇంతెందుకు అని గతంలో ఎగతాళి చేసిందని విమర్శించారు. తాము తిరి గి అధికారంలోకి వచ్చాక పింఛన్‌ను రూ. 5000 చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
తెలంగాణలో మూడు గంటలు, 5 గంటలు కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని.. అదేమంటే 10 హెచ్‌పీ మోటార్లు పెట్టాలని అంటున్నారని.. అంత సొమ్ము రైతుల కాడ ఉండాల్నా.. వద్దా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇస్తున్న కరెంటుకు వంకలు పెడుతున్నవారు.. మేం 24 గంటలు కావాలా? వద్దా? అని అడుగుతుంటే.. ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు. రైతు బంధు కావాలంటే.. జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని అన్నారు. మీ ఓటు మీ ఇష్టం అన్న కేసీఆర్ ఎవరో చెప్పిన చెప్పినట్టు వినకండి అని పిలుపునిచ్చారు. మీరు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.