సీమ రెడ్ల సందేశాలు.. తెలంగాణ ఓట‌ర్ల‌పై ప్ర‌భావం ఎంత‌..?

తెలంగాణ‌కు.. రాయ‌ల సీమ‌కు మ‌ధ్య అవినాభావ సంబంధాలు అనేకం ఉన్నాయి. ఇక్క‌డి సీమ రెడ్లు.. హైద‌రాబాద్‌లో అనేక వ్యాపారాలు చేస్తున్నార‌నేది తెలిసిందే. అదేసమయంలో మిల్లింగ్ రంగంలోనూ.. రియ‌ల్ ఎస్టేట్ లోనూ సీమ రెడ్ల పాత్ర ఎక్కువ‌గానే ఉంది. ఏపీలో ప్ర‌భుత్వం ఉన్నా.. వారు తెలంగాణ‌లో మాత్రం.. కేసీఆర్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అక్క‌డ వ్యాపారాల ద్వారా వ‌చ్చే సొమ్మునే ఏపీలో రాజ‌కీయాల‌కు ఖ‌ర్చు పెడుతున్న వారు కూడా ఉన్నారు

ఇందులో అన్ని పార్టీల నేత‌ల జాబితా కూడా ఉంది. వైసీపీ, టీడీపీ, బీజేపీల నుంచి కూడా.. అనేక మంది సీమ ప్రాంతానికి చెందిన రెడ్డి నేత‌లు.. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి త‌దిత‌ర జిల్లాల్లో వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వారు.. మ‌రోసారి బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్నే కోరుకుంటున్నార‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఎలాంటి ఇబ్బందులు లేక పోవ‌డం.. కేసీఆర్ స‌ర్కారుతో వారు క‌లిసి పోయి.. ప‌ని చేస్తుండ‌డం ఏపీలో అవ‌కాశాలు పెద్ద‌గా లేక పోవ‌డంతో.. తెలంగాణ‌లోనే వారి వ్యాపారాల‌ను విస్త‌రిస్తున్నారు.

అయితే.. వారికి తెలంగాణ‌లో ఓటు హక్కులేదు. కానీ.. తెలంగాణ ఎన్నిక‌ల‌ను మాత్రం ప్ర‌భావితం చేయ‌గల నేర్పు, ఓర్పు.. చాక‌చ‌క్యం అన్నీ ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌మ‌కు న‌చ్చిన పార్టీని వారు స‌పోర్టు చేస్తున్నార‌నేది ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం. అభ్య‌ర్థుల‌కు ఆర్థిక సాయం అందించ‌డం నుంచి ప్ర‌చారం వ‌ర‌కు కూడా.. కొందరు సీమ రెడ్లు ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ముఖ్యంగా వీరిలో వైసీపీకి చెందిన నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వ‌స్తే.. బెట‌ర్ అనే టాక్ సీమ జిల్లాల్లోనూ వినిపిస్తోంది. ఇక‌, కొంద‌రు టీడీపీ రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారట‌. రేవంత్ రెడ్డికి అనుకూలంగా వారు తెర‌చాటున చ‌క్రం తిప్పుతున్నార‌ట‌. సోష‌ల్ మీడియాలో సందేశాలు, ఐటీ ప్ర‌చారం వంటివి విరివిగా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ‌లో ఎన్నిక‌ల విష‌యంలో సీమ రెడ్డి నాయ‌కులు సీరియ‌స్‌గానే ప‌నిచేస్తున్నార‌నేది హైద‌రాబాద్ టాక్ కూడా. మ‌రి వీరి ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.