ఏపీ ఆలయానికి కేసీఆర్ విరాళం

మీడియాలో పెద్దగా హైలెట్ కాని అంశం. కానీ.. తెలుగు ప్రజలందరికి ఎంతో ఆసక్తిని కలిగించే వ్యవహారంగా దీన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి కలిసి ఏపీలోని ఒక ఆలయానికి ఆర్థికంగా దన్నుగా నిలవటం విశేషం. పెద్దగా ఫోకస్ కాని ఈ అంశానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. దీనికి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆర్థిక సాయాన్ని అందించారు. ఆలయానికి ముందు భాగంలో ఉన్న మహారాజు గోపురం.. తూర్పు మాడవీధి నిర్మాణానికి విరాళాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు.

అయితే.. ఆ మొత్తం ఎంతన్న విషయాన్ని మాత్రం ఆలయ వర్గాలు మాత్రం వెల్లడించటం లేదు. తాజాగా ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ.. కుంబాభిషేకం.. ఇతర పూజా కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. వాస్తవానికి ఈ కార్యక్రమానికి కేసీఆర్ ఫ్యామిలీ రావాల్సి ఉందట. కరోనాకు ముందు అనుకున్న మాట ప్రకారం అయితే.. శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వస్తామని చెప్పారట.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాలేకపోయినట్లుగా చెబుతున్నారు. ఆలయానికి కేసీఆర్ దంపతులు విరాళం ఇచ్చిన విషయాన్ని ఆలయ నిర్వాహకులు శిలాఫలకంలో ఆవిష్కరించారు. చేసిన దానం గురించి ఎక్కడా ప్రస్తావించని వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏమైనా.. ఎక్కడో ఏపీలోని నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఏర్పాటు చేసిన ఆలయానికి అంతలా విరాళం ఎందుకు ఇచ్చినట్లు? దాని వెనకున్న ప్రత్యేకత ఏమిటో.. కేసీఆర్ చెబితే కానీ విషయంపై క్లారిటీ రాదని చెప్పక తప్పదు.