ఆక్స్‌ఫర్డ్ టీకాపై సంచలన వివాదం

Illustrative picture of coronavirus vaccine under trail

కరోనా వైరస్ టీకా కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. వైరస్‌ను తగ్గించే, నివారించే మందు వచ్చిందంటే దాని కోసం దేశాలకు దేశాలు ఎలా ఎగబడతాయో తెలిసిందే. ఆ టీకా వద్దనే వాళ్లు ఎవరైనా ఉంటారా? కానీ ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన టీకాను ఎవరూ తీసుకోవద్దంటూ వివిధ దేశాల్లో ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు పిలుపునిస్తుండటం గమనార్హం. ఇందుకు కారణం కాస్త చిత్రమైందే.

1970లో మృతి చెందిన ఓ శిశువు మూలకణాలను టీకా అభివృద్ధిలో వినియోగించారని, అందుకే ఈ టీకా వాడొద్దనేది వారి వాదన. ఆస్ట్రేలియాలో ఈ విషయమై ముస్లిం మత పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టీకాను కొనుగోలు చేయొద్దని దేశ ప్రధానికి లేఖలు కూడా అందాయి. అక్కడి ముస్లిం సంస్థలు రోడ్ల మీదికి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి తలెత్తడం గమనార్హం.

ఆక్స్‌ఫర్డ్ కరోనా టీకాను ముస్లింలు తీసుకోవద్దంటూ ఆస్ట్రేలియాకు చెందిన సుఫీయా ఖలీఫా అనే ఇమామ్ ఇటీవల పిలుపునిచ్చారు. ఓ మృత శిశువు మూల కణాలను టీకా కోసం ఉపయోగించడం అంటే ముస్లిం మతం ప్రకారం ఇది హరామ్ అని.. మతాచారాల ప్రకారం దాన్ని నిషేధిస్తున్నామని ఓ యూట్యూబ్ వీడియో ద్వారా ఆయన వివరించారు.

ఆస్ట్రేలియాకే చెందిన క్రిస్టియన్ మత పెద్ద ఆంటోనీ ఫిషర్ సైతం ఆక్స్‌ఫర్డ్ టీకాను వ్యతిరేకిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. టీకా అభివృద్ధిలో శిశువు మృతకణాలను వినియోగించారని ఆయన కూడా ఆరోపించారు. ఇది క్రైస్తవులకు నైతికపరమైన సమస్యను సృష్టిస్తోందని అన్నారు. ఆయన ప్రధాని ప్రధాని స్కాట్ మారిసన్‌కు లేఖ కూడా రాశారు. ఈయన లేఖకు మద్దతు తెలుపుతూ..ఆంగ్లికన్, గ్రీక్ ఆర్థొడాక్స్ మత పెద్దలు కూడా సంతకాలు చేశారు. వేరే దేశాల్లోనూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతన్నాయి. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.