కూతురి కోసం బీజేపీకి కేసీఆర్ దాసోహం: సీపీఐ నారాయణ

ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ పై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం నుంచి బయటపడేసేందుకు బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారని నారాయణ షాకింగ్ ఆరోపణలు చేశారు. మొన్నటిదాకా బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ కూతురి కోసం బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. బిజెపి, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం ఉందని, అందుకే కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయలేదని అన్నారు.

కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణకు గుండెకాయ వంటి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ప్రచారం చేయాలని, ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ఒకే దెబ్బకు మూడు పిట్టలు రాలతాయని, బిజెపి-బీఆర్ఎస్-ఎంఐఎంల ఓటమి తధ్యమని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన కేసుల కోసం మోడీ కాళ్ల ముందు తలవంచారని నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు.

కేంద్రం ముందు జగన్ మోకరిల్లడం వల్లే పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని చెప్పుకొచ్చారు. దేశంలో ఇంతకాలం బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.