రింగు రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట

కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసుతోపాటు ఇసుక కేసులలో చంద్రబాబుకు తాజాగా ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ రెండు కేసులలో చంద్రబాబుపై ఎటువంటి తొందరపాటు చర్యలు, నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

ఐఆర్ఆర్ కేసును ఈ నెల 29న, ఇసుక కేసును ఈ నెల 30న విచారణ జరుపుతామని హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు, మద్యం టెండర్ల కేసులో కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు, ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. వాస్తవానికి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు గురువారం సాయంత్రంనాటికి పూర్తయ్యాయి. దీంతో, శుక్రవారం నాడు ఈ రెండు కేసుల్లో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాల్సి ఉంది.

అయితే, వేరే కోర్టులో ఆయన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐఆర్ఆర్ కేసు 29కి, ఇసుక కేసును 30 కి కోర్టు వాయిదా వేసింది. ఏది ఏమైనా చంద్రబాబుకు సంబంధించి ఈ మూడు కేసులలో త్వరలోనే తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.