ఏ సమస్య అయినా.. తన దాకా వస్తే తప్ప.. తెలియదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సెగ తగిలితేతప్ప.. స్పందించే పరిస్థితి లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. గతంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై విమర్శలు, మీమ్స్ వచ్చినప్పుడు హాయిగా ఎంజాయ్ చేసిన బీజేపీ నేతలు.. తర్వాత కాలంలో ప్రధాని మోడీపై విమర్శలు రావడాన్ని సహించలేక పోయింది. ఆ వెంటనే చట్టం కొరడా ఝళిపించి.. సోషల్ మీడియాపై కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది.
అలానే.. తాజాగా దేశంలో కీలక అంశంగా మారి, తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం డీప్ ఫేక్. ఇలా .. డీప్ ఫేక్‌వీడియోలతో అనేక మంది దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. సినీతారల నుంచి పారిశ్రామిక దిగ్గజాల వరకు కూడా డీప్ ఫేక్ బాధితులే. అయితే.. ఎవరి విషయంలో ఏం జరిగినా.. కేంద్రం మాత్రం సైలెంట్‌గా చూస్తూ ఊరుకుంది. ముఖ్యంగా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన తర్వాత.. కూడా సైలెంట్‌గానే ఉండిపోయింది. కానీ, ఇదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై డీప్ ఫేక్ వీడియో హల్చల్ కాగానే.. నిబంధనల ఉచ్చు బిగించింది.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న నరేంద్ర మోడీకి.. డీప్ ఫేక్ చుట్టుముట్టింది. ఆయన కొందరు మహిళలతో కలిసి గార్భా డ్యాన్స్ చేస్తున్నట్టుగా సృష్టించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది. దీనిపై ఆయన నేరుగా కూడా స్పందించారు. ఇది తనను బాధించిందని, దేశానికి ఇది అంటు వ్యాధిగా మారకముందే.. చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆయన అలా వ్యాఖ్యానించారో.. లేదో.. కేంద్రం ఇలా చర్యలు తీసుకుంది.
డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొస్తామని, అవసరమైతే జరిమానాలు కూడా విధించే ఆలోచనలో ఉన్నామని కేంద్ర ఐటీశాఖ వెల్లడించింది. డీప్‌ఫేక్ అంశంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, కృత్రిమమేధ సాధనాలపై పనిచేసే కంపెనీలతో సమావేశం నిర్వహించి.. డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించే వారికి, వాటి వ్యాప్తికి కారణమయ్యే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు భారీ జరిమానా విధించే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొంది. ఈ పరిణామంపై నెటిజన్‌లు ఆసక్తిక ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మోడీకి సెగ తగిలితే తప్ప.. చర్యలు తీసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు.