‘టీచ‌ర్లు’.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌.. !

పాఠ‌శాలలు-విద్యార్థులు-ప‌రీక్ష‌లు-చ‌దువు…వీటికి మాత్ర‌మే ప‌రిమితం కావాల్సిన ఉపాధ్యాయులు.. వారికి సంబంధించిన విష‌యాలు ఇప్పుడు పొలిటిక‌ల్‌గా కూడా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అంతేకాదు.. ఏపీలో ఇప్పుడు టీచ‌ర్ల చుట్టూనే వివాదాలు, చ‌ర్చ‌లు కూడా రాజుకున్నాయి. దీంతో వీరి విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

విష‌యం ఏంటి..?
రాష్ట్రంలో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఉపాధ్యాయుల సేవల ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం వినియోగించుకుంటుంది. ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలోనే ఎక్క‌డైనా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అయితే.. ఆ మేర‌కు ఎన్నిక‌ల సంఘానికి సిబ్బంది, అధికారులు ఉండ‌రు. పైగా అంతో ఇంతో ఉన్నత విద్య చ‌దివిన వారు అవ‌స‌రం కాబ‌ట్టి, ప్ర‌తిసారీ ఎన్నిక‌లు జ‌రగ‌వు కాబ‌ట్టి.. ఐదేళ్ల కోసారి.. లేదా అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆయా రాష్ట్రాల్లో టీచ‌ర్ల‌ను ఎన్నిక‌ల సంఘం వినియోగించుకుంటుంది.

ఇలా వినియోగించుకున్న సేవ‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల సంఘం.. రుసుము చెల్లిస్తుంది. అయిన‌ప్పటికీ.. ఎన్నిక‌లు అన‌గానే రాజ‌కీయాల‌తో సంబంధం ఉండ‌డం.. ఏదైనా తేడా వ‌చ్చి దాడులు జ‌రిగితే.. కేసులు పెట్ట‌డం.. కోర్టుల చుట్టూ తిర‌గాల్సి రావ‌డం.. ఈ క్ర‌మంలో స‌హ‌జం. దీనిని చాలా మంది టీచ‌ర్లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో త‌మ‌ను ఎన్నికల విధుల నుంచి త‌ప్పించాల‌ని ఎప్పటి నుంచో వారు కోరుతు న్నారు.

వైసీపీ ప్ర‌భుత్వం ఏం చేసిందంటే.. టీచ‌ర్ల‌కు ఉన్న డిమాండ్ల‌లో కీల‌క‌మైన ఈ విధుల నుంచి త‌ప్పించిం ది. అయితే.. నేరుగా పేర్కొన‌కుండా.. విద్యాసంబంధేత‌ర విధుల నుంచి ఉపాధ్యాయుల‌ను త‌ప్పిస్తున్నట్టు పేర్కొంది. అయితే.. మ‌రోవైపు తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. టీచ‌ర్ల విధులు త‌మ‌కు అవ‌స‌ర‌మని.. వారి పేర్లు వివ‌రాలు పంపించాల‌ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించింది. ఇదే ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఏంటి వివాదం..?
వైసీపీ ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే టీచ‌ర్ల‌ను విధుల నుంచి త‌ప్పించింద‌నే వాద‌న ఉంది. దీనిని ప్ర‌తిప‌క్షాలు ఎక్కువ‌గా ఆరోపిస్తున్నాయి. స‌ర్కారు తీరుపై గుస్సాగా ఉన్న టీచ‌ర్లు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌ను ఇబ్బంది పెడ‌తార‌నే ఉద్దేశంతోనే .. వైసీపీ ఇలా చేసింద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే వారికి ఎన్నిక‌ల విధులు తీసేసింద‌ని చెబుతున్నాయి. అయితే.. ఇప్పుడు వైసీపీ ఎత్తులు చిత్తు చేస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఉపాధ్యాయుల‌ను వాడుకునేందుకు రెడీ అయింద‌ని ఇది వైసీపీకి శ‌రాఘాత‌మ‌ని అంటున్నారు.

వాస్త‌వం ఏంటి..?
ఈ చ‌ర్చ‌లో కీల‌క అంశం.. ఉపాధ్యాయులు ఎన్నిక‌లను ప్ర‌భావితం చేస్తారా? అనేది. అయితే.. దీనికి నిపుణులు చెబుతున్న మాట ఆ అవ‌కాశం ఉపాధ్యాయుల‌కు లేద‌నే. ఎన్నిక‌ల వేళ కేవ‌లంఓట‌ర్ల వివ‌రాల‌ను న‌మోదు చేయ‌డం.. ఓట‌రు స్లిప్పులు ఇవ్వ‌డం వ‌ర‌కే విధుల్లో ఉన్న టీచ‌ర్లు ప‌రిమితం అవుతార‌ని.. అంత‌కు మించి వారు చేసేది ఏమీ లేద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఏమైనా చేస్తే.. ఉద్యోగానికే ముప్పు పొంచి ఉంటుంద‌ని అంటున్నారు. కాబ‌ట్టి.. టీచ‌ర్ల చుట్టూ జ‌రుగుతున్న వివాదం కేవ‌లం రాజ‌కీయాల కోస‌మే త‌ప్ప‌.. వాస్త‌వం కాద‌ని తేల్చేస్తున్నారు.