తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జోరు పెంచారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, హరీష్ రావుల విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు.
ప్రతి సభలో తాను బక్కోడిని అని చెప్పుకుంటున్న కేసీఆర్ బకాసురుడు అని రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ సంపదను మింగిన బకాసురుడు కేసీఆర్ అని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ చుట్టూ 10 వేల ఎకరాల భూమిని మింగేశారని, ఎన్నికల్లో ఓడితే ఫామ్ హౌస్ కి వెళ్లి పడుకుంటానని నిర్లక్ష్యంగా కేసీఆర్ సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే గజ్వేల్ ప్రజలు, యువత ఊరుకోరని, పొలిమేరలు దాటేలా తరిమికొడతారని రేవంత్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ మింగిన లక్ష కోట్లను కక్కిస్తామన్నారు. తన గురించి కేసీఆర్ ఎన్నో అబద్ధాలు చెబుతున్నారని, ఆయన చెప్పేది నిజమైతే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లాగా అబద్ధాలను చెక్ చేసే టెస్ట్ కు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గజ్వేల్ లో వ్యతిరేకత కారణంగానే కామారెడ్డికి కేసీఆర్ పారిపోయారని సంచలన ఆరోపణలు చేశారు. గజ్వేల్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేసీఆర్ ఆదాయానికి, ఇప్పుడు ఆయన ఆదాయానికి తేడా ఎంత అని రేవంత్ ప్రశ్నించారు.
అబద్దాలు చెప్పి ప్రజలను మోసగించడంలో కేసీఆర్ దిట్ట అని ఎద్దేవా చేశారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని, కానీ దగాకోరులు, దొంగలు, దోపిడీదారుల చేతుల్లో ఆ తెలంగాణ బలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని, కానీ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా కేసీఆర్ వేసే ఏ శిక్షకైనా సిద్ధం అని ఛాలెంజ్ చేశారు. మరి, రేవంత్ సవాల్ ను కేసీఆర్ స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.