మిగిలిన ముఖ్యమంత్రులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక తేడా ఉంది. ఆయనలో ఏదైనా మార్పు వస్తే ఇట్టే అర్థమైపోతుంది. దాని కోసం అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. మూడ్ ఎలా ఉన్నా.. దాన్ని దాచుకోవటం ఆయనకు చేతకాని పని. తాను ఏమనుకున్నానో ఆ విషయాన్ని చెప్పేస్తారు. తన మారిన తీరును దాచుకోరు. బాహాటంగా చూపించటానికి అస్సలు సంకోచించరు. మొహమాటాలు లాంటి అస్సలు కనిపించవు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ ఉన్న వేళలో తరచూ రాజ్ భవన్ కు వెళ్లే సీఎం కేసీఆర్.. అక్కడ గంటల కొద్దీ కాలాన్ని గడిపేవారు. అదేమంటే.. ప్రభుత్వ నిర్ణయాల్ని గవర్నర్ కు వివరించినట్లుగా చెప్పేవారు. దేశంలోని మరే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కూడా అంత ఎక్కువసేపు గవర్నర్ వద్ద గడిపిన దాఖలాలు ఉండవు. అన్ని ఎక్కువసార్లు రాజ్ భవన్ కు వెళ్లింది లేదు.
ఎప్పుడైతే నరసింహన్ వెళ్లిపోయి.. ఆయన స్థానంలో తమిళ సై వచ్చారో.. అప్పటినుంచి కేసీఆర్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడో కానీ వెళుతున్నారు. అది కూడా ఆచితూచి అన్నట్లు. ఆ మాటకు వస్తే.. తప్పనిసరిగా వెళ్లాల్సిన సందర్భాల్లో మాత్రమే రాజ్ భవన్ కు వెళుతున్న తీరుకనిపిస్తుంది. అంతేకాదు.. గవర్నర్ ను కలిసేందుకు వెళ్లినా.. చాలా తక్కువ వ్యవధిలోనే తిరిగి వెళ్లిపోవటం కనిపిస్తుంది.
గతంలో గంటల కొద్దీ రాజ్ భవన్ లో ఉంటూ.. గవర్నర్ తో మంతనాలు జరిపే ఆయన.. ఇప్పుడు మాత్రం వెళ్లామా? తిరిగి వచ్చామా? అన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. తాజాగా గవర్నర్ బంధువు మరణించిన నేపథ్యంలో పరామర్శకు వెళ్లిన కేసీఆర్.. కాసేపటికే తిరిగి రావటంతో.. గతంలో అయితేనా? అన్న మాట అక్కడి వారి మాటల్లో ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates