ఇక‌, మోడీ మ‌కాం.. మార్పు వ‌చ్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల‌నే ల‌క్ష్యం ఓవైపు.. ఇది సాధ్యం కాక పోతే.. క‌నీసం గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానాల‌లో అయినా విజ‌యం ద‌క్కించుకోవాల‌నే త‌లంపు మ‌రోవైపు పెట్టు కున్న బీజేపీ వ్యూహాత్మ‌కంగానే ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి నాయ‌కులు వ‌స్తున్నారు. ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతుండ‌డంతో నాయ‌కులు దూకుడు పెంచారు. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌క్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ‌చ్చి పోతున్న ప్ర‌ధానిన‌రేంద్ర మోడీ.. ఇప్పుడు ఏకంగా మూడు రోజుల పాటు తెలంగాణ‌లోనే మ‌కాం వేయ‌నున్నారు. ఈ నెల 25 నుంచి 27 వ‌ర‌కు మూడు రోజుల పాటు ఆయ‌న హైదరాబాద్‌లోనే ఉండ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసేలా.. ప్ర‌ణాళిక రెడీ చేసుకున్నా రు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. ఈ ప్ర‌చారం గురువారం సాయంత్రంతో ముగియ‌నుంది. ఆవెంట‌నే తెలంగాణ‌పై బీజేపీ నేత‌లు ఫోక‌స్ పెంచ‌నున్నారు.

ఇప్ప‌టికి రెండు సార్లు హైద‌రాబాద్కు వ‌చ్చిన పీఎం మోడీ..ఎల్బీ స్టేడియంలో ఒక‌సారి బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. త‌ర్వాత సికింద్రాబాద్‌లో జ‌రిగిన ఎంఆర్ పీఎస్ స‌భ‌కు వ‌చ్చారు. ఈ రెండు ప‌ర్య‌ట‌న ల్లోనూ బీజేపీకి సానుకూల ప‌రిణామాలు వ‌చ్చాయి. అయితే.. ఇది చాల‌ద‌ని.. ఎన్నిక‌ల పోరు తీవ్రంగా ఉండ‌డంతో మ‌రింత వేగం పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బీజేపీ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీ ఏకంగా మూడు రోజుల పాటు మ‌కాం ఏర్పాటు చేసుకుని.. తెలంగాణ‌లో సుడిగాలి ప‌ర్య‌ట‌నలు చేసేలా ప్లాన్ చేసుకున్నారు.

వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, ఖ‌మ్మం, హైద‌రాబాద్‌, ఆదిలాబాద్‌(ఎస్టీ ఓటుబ్యాంకు కోసం) ఉమ్మ‌డి జిల్లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు సాగ‌నున్నాయి. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధ‌మైంది. మ‌రోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కుడు అమిత్‌షా కూడా వ‌చ్చే నాలుగు రోజులు(రాజస్థాన్ ప్ర‌చారం ముగిసిన వెంట‌నే) తెలంగాణ‌లోని రూర‌ల్ ప్రాంతాల్లో ప‌ర్యటించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అగ్ర‌నేత‌ల మ‌కాం.. ఏమేర‌కు మార్పు తెస్తుందో చూడాలి.