తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల తరఫున తొలిసారి ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మైకు పట్టారు. వరంగల్ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన విజయసంకల్ప యాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీపైనే ఎక్కువగా ఫోకస్ చేయడం గమనార్హం. ఏపీలో రౌడీలు రాజ్యామేలుతున్నారని, గూండాల పాలన నడుస్తోందని పవన్ దుయ్యబట్టారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడేందుకు వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని చెప్పారు.
ఇక, అందరిలాగానే పవన్ కూడా సెంటిమెంటుకు ప్రాణం పోశారు. “తెలంగాణ నా గుండెచప్ఫుడు. ఇకపై తెలంగాణలోనూ అడుగుపెడుతున్నాను. తెలంగాణ ధైర్యంతోనే ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నాను” అని వ్యాఖ్యానించారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ తనకు పునర్ జన్మనిచ్చిందని చెప్పారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని, కానీ, ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.
బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానని పవన్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేన ఉంటుందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావులను గెలిపించాలని కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates