తెలంగాణా ఎన్నికల్లో ఇపుడొక ఆందోళనకరమైన విషయం బయటపడింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన వివరాల ప్రకారం వివిధ పార్టీల తరపున పోటీచేస్తున్న 360 మంది అభ్యర్ధుల్లో 226 మంది నేరచరితులేనట. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తరపున పోటీచేస్తున్న వారిలో అత్యధికులు నేరచరితులే అన్న విషయం బయటపడింది. అంటే వీళ్ళల్లో గెలిచిన చాలామంది రేపు మన ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో కూర్చుంటారు. చట్టసభల్లోకి నేరచరితులు ప్రవేశించకూడదన్నది మామూలు జనాల నుండి అత్యున్నత న్యాయస్ధానం సుప్రింకోర్టు వరకు పదేపదే కోరుకుంటున్నదే.
అయితే పోటీచేసే వాళ్ళల్లో అత్యధికులు నేరచరితులే అయినపుడు జనాలు ఎవరికి ఓట్లేయాలి ? ఈ ఆలోచనలో నుండి పుట్టిందే నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) ఆప్షన్. అందుకనే ఎన్నిక ఎన్నికకు నోటాకు పడుతున్న ఓట్లు పెరుగుతున్నది. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్నికల్లో పోటీ సందర్భంగా అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. ఆ నామినేషన్లతో తమపై నమోదైన కేసులను అఫిడవిట్ల రూపంలో అందించారు. ఆ అఫిడవిట్ల ప్రకారమే 226 మందిపై అనేక కేసులున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి చెప్పారు.
ఎన్నికల్లో నేరచరితులు పాల్గొనటం అన్నది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిదికాదని రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు జనాలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లేయాలని సూచించారు. అభ్యర్ధులపై నమోదైన కేసుల్లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో నమోదైన కేసులతో పాటు భూ కబ్జాలు, కిడ్నాపులతో పాటు అనేక క్రిమినల్ కేసులున్నట్లు చెప్పారు. ఈ కేసులు ఎక్కువగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులపైనే ఉన్నాయి.
బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న 58 మందిపైన 120 కేసులున్నాయి. కేసీయార్ పైన 9, మంత్రులు గంగుల కమలాకర్ మీద 10 కేసులు, కేటీయార్ మీద 8 కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్ధులు 84 మందిపైన 540 కేసులున్నాయి. వీరిటో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైన 89, బొజ్జాపై52, ప్రేమ్ సాగర్ పై 32, పీ. శ్రీనివాస్ పై 24 కేసులు నమోదయ్యాయి. బీజేపీ అభ్యర్ధులు 78 మీద 549 కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ పై 89 కేసులు, బండి సంజయ్ పై 59, సోయం బాబూరావుపై 55 కేసులున్నాయి. ఫైనల్ గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పైన కూడా 6 కేసులున్నాయి.