మరో వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నెల 30న పోలింగ్‌కు సర్వసిద్ధమైంది. దీంతో నాయకులు, పార్టీలు దూకుడు పెంచాయి. కానీ.. ఇన్నాళ్లయినా.. తెలంగాణ సమాజం నాడిని మాత్రం పట్టుకోలేక పోయారు. అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ల మధ్యే.. పోటీ తీవ్రంగా ఉంటుందని తెలిసినా.. ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో ఇప్పటికీ స్పష్టత రాలేదు. చిట్టచివరి నిముషంలో అంచనాలు మారితే.. అప్పుడు ఏ పార్టీ గెలుస్తుందనేది తేలిపోతుంది.
ఈ చిట్ట చివరి నిముషంలోనే అనేక సమీకరణలు మారిపోయే అవకాశం ఉందని మరో అంచనా వస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలు, నాయకులు కూడా పంపకాలకు రెడీ అయినట్టు సమాచారం. ఇదే ఎన్నికల సరళిని మార్చేస్తుందని కూడా అంచనావేస్తున్నారు. అయితే.. ఇది అంత ఈజీకాదనేది తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఇప్పటి వరకు 1750 కోట్లు పట్టుబడ్డాయి.
వీటిలోనూ ఇప్పటికి తెలంగాణలోనే 656 కోట్లు పట్టుబడ్డాయి. ఇంకా ఎన్నికలకు మరో వారం సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం బుధవారం నుంచి మరిన్ని బలగాలను తెలంగాణకు పంపించనున్నట్టు తెలిపింది. దీంతో అన్ని వైపుల అష్టదిగ్భదం చేయనున్నారు. ప్రతి రూపాయికీ లెక్క చూపించడంతోపాటు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టనున్నారు. ఇది ఒకరకంగా.. పోటీలో ఉన్న నాయకులకు కాళ్లు చేతులు కట్టేసినట్టు అయిందనే వాదన వినిపిస్తోంది.
నిజానికి ఇప్పుడు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో నాయకులు పోటా పోటీ ప్రచారాలు చేస్తున్నారు. అయితే.. ఎవరికీ కూడా.. గెలుపుపై ధీమా లేకుండా పోయింది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందని సర్వేలు వస్తున్నా యి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని ప్రయత్నిస్తున్నవారు.. కొందరు తమ దారులు తాము వెతుక్కుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఎన్నికల సంఘం అష్టదిగ్బందం చేసేందుకు రెడీ కావడంతో నాయకులు అల్లాడిపోతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.