అమలాపురం ఎమ్మెల్యే.. మంత్రి పినిపే విశ్వరూప్ కనిపించడం లేదా? ఆయన ఎవరితోనూ కలివిడిగా లేరా ? అంటే.. ఔననే అంటున్నారు నియోజకవర్గం ప్రజలు. అప్పుడెప్పుడో .. కోనసీమ జిల్లా పేరు మార్పు సమయంలో జరిగిన ఘర్షణ తర్వాత.. మళ్లీ ఆయన మొహం కూడా తాము చూడలేదని చెబుతున్నారు. అయితే.. మరోవైపు మంత్రి వర్గం మాత్రం సార్ గడపగడపలో బిజీబిజీగా ఉంటున్నారని వెల్లడిస్తున్నారు. కానీ, వాస్తవానికి అమలాపురంలో గడపగడప కార్యక్రమం జరగడం లేదని పార్టీ అధిష్టానానికి నివేదికలు అందాయి.
దీంతో అసలు విశ్వరూప దర్శనం ఎక్కడ ? అనే చర్చ జరుగుతోంది. సాధారణంగానే విశ్వరూప్ వివాదాల జోలికి పోకుండా.. తన పనితాను చేసుకుని పోతారనే పేరుంది. అయితే.. ఇప్పుడు ఆ పని కూడా.. ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన దూకుడు పెరగడం.. అధిష్టానం కూడా.. ఆయనకే విలువ ఇచ్చేలా వ్యవహరిస్తుండడంతో విశ్వరూప్ సైలెంట్ అయ్యారనిఅంటున్నారు. ముఖ్యంగా కాపులపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో విశ్వరూప్ విమర్శలకు గురయ్యారు.
కానీ, వాస్తవానికి కాపులపై కేసుల విషయానికి తనకు సంబంధం లేదని.. ఓ నాయకుడు(మంత్రి అనే టాక్ ఉంది) ఉద్దేశం పూర్వకంగా.. కాపు యువతను ఈ కేసుల్లో(మంత్రి ఇల్లు తగలబెట్టడం) ఇరికించారనేది విశ్వరూప్ మాట. అయితే.. ఆ మాటను బయటకు అనలేక.. క్షేత్రస్థాయిలో తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టలేక ఆయన సతమతం అవుతున్నారు. దీంతో అసలు బయటకు రావడం లేదని మరో వైపు వినిపిస్తోంది. ఇదిలావుంటే.. మంత్రిగా కూడా తనకు ప్రాధాన్యం తగ్గిపోయిందని విశ్వరూప్ చెబుతున్నారు.
కనీసం డీఎస్పీ స్థాయి అధికారి కూడా తన మాట వినిపించుకోవడం లేదని..ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి చెప్పినట్టే వింటున్నారని.. అంతా ఆయన కనుసైగల్లోనే నడుస్తున్నారన్నది మంత్రి వర్గం మాట. దీంతో తాను బయటకు వచ్చినా ఎవరికీ ఎలాంటి హామీ ఇచ్చే పరిస్థితి లేదని.. ఇచ్చినా.. సాకారం కాదని.. దీనివల్ల తనకు బ్యాడ్ నేమ్ వస్తుందని మంత్రి భావిస్తున్నట్టు సమాచారం. ఫలితంగా విశ్వరూప్ ఎక్కడా కనిపించడం లేదు. మరి ఎన్నికల సమయానికి ఇది మైనస్ అవుతుందో ప్లస్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates